3, ఏప్రిల్ 2011, ఆదివారం

నవ్వించే వింత వాదనలు

విషయం సీరియస్‌దే అయినా కొందరి వాదనలు మనకు బోలెడు నవ్వు తెప్పిస్తుంటాయి. ఇలాంటి వాదనలపై పాత తరం రచయిత మునిమాణిక్యం వితండవాదనపై ఏకంగా ఒక గ్రంధమే రాశారు.

ఆయన దూరపు బంధువుల అబ్బాయికి పెళ్లి సంబంధం కుదరడం లేదు. ఒకసారి మునిమాణిక్యం పాపం వాడికి పెళ్లి కుదరలేదని బాధపడుతుంటే వాళ్లావిడ నేను అప్పుడే అనుకున్నాను బర్మావెళ్లిన వాడికి పిల్లనెవరిస్తారు అంటుంది. పెళ్లి కాకపోవడానికి అతను బర్మా వెళ్లడానికి సంబంధం ఏమిటని మునిమాణిక్యం ఆశ్యర్యపోయి, అదే విషయం అడుగుతాడు.

వంకర టింకరగా నడిచే వాడు బర్మా వెళ్లే ఉంటాడు లేండి అని భార్య బదులిస్తుంది. పెళ్లి సంబంధం కుదరకపోవడానికి బర్మా వెళ్లడానికి, బర్మావెళ్లిన వాడు వంకరటింకరగా నడవడానికి ఒకదాని కొకటి ఏ మాత్రం సంబంధం ఉండదు, కానీ ఆమె అలానే తన వాదనను పొంతన లేని విషయాలతో సమర్ధించుకుంటుంది. మునిమాణిక్యానికి వితండవాదం గురించి చెప్పడానికి ఒకే ఒక ఉదాహరణ దొరికిందేమో కానీ మన తెలుగు నాయకుల ఉపన్యాసాలు వింటే ఆ వితండ వాదాల నుంచి సరైన వాదన ఒక్క ముక్క దొరకడం కూడా కష్టమే అనిపిస్తుంది.

అచ్చం మునిమాణిక్యం భార్యలానే తెలంగాణకు పాకిస్తాన్‌కు లింకు కలుపుతూ లగడపాటి రాజగోపాల్ తన జ్ఞానాన్ని వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తే పాకిస్తాన్ కల ఫలిస్తుందట! పాకిస్తాన్ కల ఫలించాలని కోరుకునే వారే తెలంగాణ కోరుకుంటారనేది ఆయన వాదన.
హైదరాబాద్‌లో ఐఎస్‌ఐ స్థావరాన్ని ఏర్పాటు చేసుకోవాలంటే తెలంగాణ ఏర్పడితేనే మంచిదని పాకిస్తాన్ కోరుకుంటుందట! రెండు రోజుల ముందు తొందర పడి ఆయనీ వాదన చేశారు కానీ మరో రెండు రోజులు ఆగి ఉంటే తన వాదన మరింత బలంగా చెప్పడానికి ఆయనకు అవకాశం లభించేది.

భారత్ తమకు మంచి మిత్ర దేశం కానీ, అఫ్ఘానిస్తాన్, పాకిస్తాలు కవల పిల్లల వంటివని ఆఫ్ఘాన్ అధ్యక్షుడు ప్రకటించారు. అంటే పాకిస్తాన్ కల ఫలిస్తే అది అఫ్ఘాన్ కల ఫలించినట్టే కదా! ఆఫ్ఘాన్ కల ఫలిస్తే లాడెన్ కల ఫలించినట్టే కదా! అంటే తెలంగాణ ఏర్పడితే లాడెన్ హైదరాబాద్‌లో మకాం పెడతాడు.

హైదరాబాద్ కేంద్రంగా చేసుకుని లాడెన్ ప్రపంచాన్ని గడగడలాడిస్తాడు. అంటే తెలంగాణను ఏర్పాటు చేస్తే మొత్తం ప్రపంచానికే ప్రమాదం కదా! మొత్తం ప్రపంచానే్న టార్గెట్ చేసుకుంటూ లగడపాటి వాదన చేస్తే, శ్రీకృష్ణ కమిటీకి కూడా దిమ్మతిరిగి పోకుండా ఉంటుందా?
ఇదే తరహాలో టిడిపి సీనియర్ నాయకుడు ఎర్రంనాయుడు ఆలోచించినా, ముందడుగు వేయలేకపోయారు. ఐదునెలల పాటు అభిప్రాయాలు సేకరించి తెలంగాణ ఏర్పాటుకు రాష్ట్ర ప్రజలంతా ఆమోదిస్తున్నారని నివేదిక ఇచ్చిన టిడిపిపి మాజీ నాయకుడు ఎర్రంనాయుడు తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించడానికి బలమైన వాదన కోసం మిత్ర బృందంతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతుంటే అందులో ఒకరు కలసి ఉంటే కలదు సుఖం అనే పాత సూక్తిని పట్టుకుని వేలాడుతున్నారు.
బలమైన వాదన వినిపించడం లేదు, తెలంగాణ ఏర్పడితే లాడెన్ హైదరాబాద్‌లో మకాం వేస్తాడు, దాని వల్ల ప్రపంచానికే ప్రమాదం కాబట్టి తెలంగాణ ఏర్పాటుకు అమెరికా వ్యతిరేకిస్తుంది, అందుకే హోంమంత్రి డిసెంబర్ తొమ్మిదిన చేసిన ప్రకటన నుంచి వెనకడుగు వేశారనే ప్రచారం మొదలు పెడితే అదిరిపోతుంది, అని సలహా ఇచ్చారు.

ఎర్రంనాయుడు వెంటనే స్పందించి, ప్రచారం చేయడం ఏమిటి ఇది వాస్తవం, అందుకే హైదరాబాద్ వెళ్లవద్దని అమెరికా తమ పౌరులను హెచ్చరించింది నాయుడు సీరియస్‌గానే చెప్పేసరికి అక్కడున్న వారు విస్తుపోయారు. తెలంగాణ ఏర్పాటుకు అమెరికా ఎందుకు వ్యతిరేకిస్తుందో? ఆయన వివరిస్తుంటే విన్నవారు విస్తుపోయారు. తెలంగాణ విడిపోతే అన్నింటి కన్నా పెద్ద నష్టం తెలంగాణకు సముద్రం ఉండదు అంటూ మరో సీనియర్ నేత లాల్‌జాన్ బాషా జాలి చూపారు. .

సరే ఇప్పుడేమన్నా సముద్రం ఉందా? విడిపోయాక వెళ్లిపోవడానికి అని ప్రశ్నిస్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇప్పుడు సముద్రం ఉంది, విడిపోతే తెలంగాణ రాష్ట్రానికి ఉండదు కదా! అనేది ఆయన వాదన.
నాయకుల వాదనలను రోజూ టీవిల్లో చక్కగా చూడొచ్చు. అతని వాదన కాదంటే కొడతాడేమో అని భయపెట్టే విధంగా ఉంటాయి కొందరి వాదనలు. విడిపోవాలనుకునే వారు ఏం మాట్లాడినా అర్ధం చేసుకోవచ్చు కానీ కలిసుండాలనుకునే వారు ఎదుటివారి మాటలు అస్సలు వినం అంటూ దాడులకు దిగడం ఏమిటండీ అంటూ సమైక్య వాద చర్చలో రచయిత్రి ఓల్గా ఆశ్చర్యపోయారు.

అంతా సమైక్యవాదానికి కట్టుబడి ఉండాల్సిందే, సమైక్యవాదానికి కట్టుబడని వారిని సమావేశం నుంచి బయటకు పంపాల్సిందే అంటూ కొందరు అల్లరి చేయడం ఆ సమావేశంలోని చిత్రమైన వాదన.
ఇద్దరు భార్యాభర్తలు మాట్లాడుకుంటుంటే భార్య సెల్‌ఫోన్ మోగింది. ఆమె కట్టుకున్న చీర, వారం క్రితం పుట్టింటికి వెళ్ళొచ్చిన సంగతులు, ఓ సీరియల్‌లో హీరోయిన్ కష్టాలు, సినిమాలో హీరో అందచందాల గురించి అరగంట పాటు మాట్లాడుతూనే ఉంది. భర్తకు ఓపిక నశించి ఇక్కడ మొగుడనే వాడొకడున్నాడని, వాడికి తిండిపెట్టాలనే ధ్యాస ఉందా? అని కోపంగా అడగాలనుకున్నాడు.
కానీ అడిగితే ఏమవుతుందో తెలుసు కాబట్టి కోపాన్ని అణిచిపెట్టుకుని.. ఇంతకూ అంతసేపు ఎవరితో మాట్లాడుతున్నావు అని నెమ్మదిగా అడిగాడు. రాంగ్‌నంబర్.. చేసింది వాళ్లే కదా అని నేను మాట్లాడాలనుకున్నవన్నీ మాట్లాడేశానండి అని భార్య నింపాదిగా చెప్పింది.
రాంగ్ నంబర్‌కు అరగంట మాట్లాడావా? అంటే సర్లేండి నాకిష్టమైన సీరియల్స్, సినిమాలు, చీరల గురించి మాట్లాడితే మీరేమన్నా వింటారా? ఏంటి? చాన్స్ దొరికినప్పుడే మనం మాట్లాడాలనుకున్నవన్నీ మాట్లాడేయాలి అని ముసిముసి నవ్వుల్తో సమాధానం చెప్పింది.
న్యూస్ చానల్స్‌లో చర్చలు నీకు బాగానే వంటబట్టినట్టుగా ఉన్నాయని భార్యను మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు. *

1 వ్యాఖ్య:

  1. బాగుంది. విడిపోదామనుకునేవారి వాదన వారెందుకు వింటారు? వారి దృష్టిలో తెలంగాణా అంటే అక్కడి ప్రజలు కాదు, వణరులు.

    ప్రత్యుత్తరంతొలగించు

మీ అభిప్రాయానికి స్వాగతం