29, ఏప్రిల్ 2011, శుక్రవారం

తెలంగాణ అజెండాయే ఊపిరి - టిఆర్‌ఎస్‌కుపదేళ్లు



కెసిఆర్.. ఈ పేరు వింటే సీమాంధ్రలో ఎంత వ్యతిరేకత వ్యక్తమవుతుందో, తెలంగాణలో అంత అభిమానం కనిపిస్తుంది. తెలంగాణ ఉద్యమానికి కెసిఆర్ ప్రతీకగా మారారు. పదేళ్ల కాలంలో తెలంగాణ ఉద్యమం గ్రామ గ్రామానికి పాకింది. అయితే అదే సమయంలో ఒక ఉద్యమ పార్టీగా పదేళ్లు అయినా టిఆర్‌ఎస్‌కు సరైన స్వరూపాన్ని కెసిఆర్ కల్పించలేకపోయారు.
 తెలంగాణ ప్రజల్లోని బలమైన తెలంగాణ కాంక్ష టిఆర్‌ఎస్‌ను బతికిస్తోంది కానీ రాజకీయ పార్టీగా టిఆర్‌ఎస్‌కు కెసిఆర్ బలమైన పునాదులు కల్పించలేదు. తెలంగాణ ఉద్యమం ఎన్నాళ్లుంటుంది? టిఆర్‌ఎస్ పుట్టినప్పుడు అందరి నోట వినిపించిన మాట ఇది. తెలంగాణ వస్తుందా? ఇది సీమాంధ్ర, తెలంగాణలో ఇప్పుడు వినిపిస్తున్న మాట. ఈ రెండు మాటల వెనుక పదేళ్ల చరిత్ర దాగి ఉంది.

 2001 ఏప్రిల్ 27న ఆవిర్భవించిన టిఆర్‌ఎస్ దశాబ్ది ఉత్సవాలు శుక్రవారం మహబూబ్‌నగర్‌లో జరుగుతున్నాయి. టిఆర్‌ఎస్ ఆవిర్భవించినప్పుడు ఏ రాజకీయ పార్టీ కూడా పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పుడు ఏ రాజకీయ పక్షం కూడా తెలంగాణ అంశాన్ని విస్మరించలేదు. పార్టీ ఆవిర్భవించినప్పుడు కెసిఆర్ ఏం సాధిస్తారు అని ప్రశ్నించిన ప్రత్యర్థులు సైతం ఇప్పుడు తెలంగాణ ఉద్యమాన్ని ఈ స్థాయికి తీసుకువచ్చింది కెసిఆరేని బహిరంగంగానే ప్రకటిస్తారు.
‘నన్ను కనీసం లక్ష తిట్లుతిట్టి ఉంటారు. నేను పట్టించుకోలేదు. మనం ఏదైనా పట్టుకుంటే మొండిగా వెళ్లాలి’ టిఆర్‌ఎస్ సభలో కెసిఆర్ స్వయంగా తన గురించి తాను చెప్పుకున్న విషయం. ఒక రాజకీయ నాయకుడి గురించి బహుశా ఇంత విస్తృతమైన వ్యతిరేక ప్రచారం మరెవరి విషయంలో జరిగి ఉండదు. కానీ ఇలాంటి తిట్లను ఏ మాత్రం ఖాతరు చేయకపోవడం ఒక్క కెసిఆర్‌కే సాధ్యమైంది. బహుశా ఆయన ఈ తిట్లను కూడా ఎంజాయ్ చేసినట్టుగా ఉంది. అందుకే మొండిగా ముందుకు వెళ్లి ప్రత్యర్థుల చేత కూడా ప్రశంసలు పొందే విధంగా తెలంగాణ వాదాన్ని ముందుకు తీసుకువెళ్లారు. మీడియా చేతిలో లేకపోతే మెగాస్టార్లు కూడా రాష్ట్ర రాజకీయాల్లో చతికిల పడాల్సిందే. కానీ తన మాటలనే ప్రచారాస్త్రంగా వాడుకుని ప్రత్యర్థులను చావుదెబ్బతీశారు.
అది నూతన శతాబ్ది ప్రారంభం. అప్పటికి చంద్రబాబు ఎన్నికల్లో రెండోసారి విజయం సాధించి ఏడాది గడుస్తోంది. మొదటి సారి ఎన్టీఆర్ ఇచ్చిన అధికారం అయితే, రెండోసారి తాను సొంతంగా అధికారంలోకి వచ్చారు. వాస్తవానికి చంద్రబాబు ప్రభ రోజురోజుకు క్షీణిస్తున్న కాలమది. కానీ రెండవ సారి విజయం సాధించిన చంద్రబాబు ఎవరి మాటా వినే పరిస్థితిలో లేరు. వాస్తవానికి ఆయన పునాదులు కదిలిపోతున్నాయి కానీ మీడియాలో మాత్రం అంతర్జాతీయ స్థాయి నాయకుడిగా ప్రచారం పొందుతున్నారు. మీడియా మేనేజ్‌మెంట్ ద్వారా తన ఇమేజ్‌ను తానే అద్భుతంగా బూస్టప్ చేసుకుని, అది నిజమేనని చంద్రబాబు కలల ప్రపంచంలో విహరిస్తున్న కాలమది.
 పునాదులు కదులుతున్నప్పుడు అప్రమత్తంగా ఉన్నవారే విజేతలు. సరిగ్గా అలాంటి సమయంలోనే చంద్రశేఖర్‌రావులోని చురుకైన రాజకీయ నాయకుడు మేల్కొన్నాడు. అటు చూస్తే చంద్రబాబు ప్రభావం కొడిగట్టి పోతోంది. పైగా తనకు మంత్రి పదవి ఇవ్వకుండా అవమానించారు. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నవారే రంగంలో నిలుస్తారు. ఇదే సరైన సమయం అని భావించిన కెసిఆర్ తెలంగాణ ఉద్యమంపై దృష్టిసారించారు. ఒకవైపు వర్షాలు లేక వరుసగా ఐదేళ్ల నుంచి కరవు.
 ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. గ్రామాల్లో పనులు లేవు. నిజంగానే ‘పల్లే కన్నీరు పెట్టింది..’ అన్నట్టుగానే ఉంది గ్రామాల పరిస్థితి. వర్షాలు పడి పొలం బాగా తడిచినప్పుడు విత్తనాలు నాటితేనే పంట పండుతుంది. జనం ఆగ్రహంతో ఉన్నప్పుడు రంగంలోకి దిగితేనే రాజకీయం పండుతుంది. ఇదే సమయంలో చంద్రబాబు వ్యవసాయానికి విద్యుత్ చార్జీలను పెంచారు. తెలంగాణ మొత్తం బోరుబావులపైనే వ్యవసాయం జరుగుతుందని, వ్యవసాయానికి విద్యుత్ చార్జీలు పెంచడం వల్ల తెలంగాణ రైతు చావుదెబ్బ తింటాడని అప్పుడు డిప్యూటీ స్పీకర్‌గా ఉన్న చంద్రశేఖర్‌రావు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబుకు బహిరంగ లేఖ రాశారు.
 ఈ లేఖ వాస్తవానికి తెలంగాణ ఉద్యమానికి ముందుమాట లాంటిది. దమ్ముంటే డిప్యూటీ స్పీకర్ పదవికి రాజీనామా చేయాలి అనే మాట టిడిపి వారి నుంచి అనిపించుకుని, మీరు ఒక రాజీనామా అడిగితే నేను మూడు ఇస్తున్నాను అంటూ డిప్యూటీస్పీకర్ పదవికి, శాసన సభ్యత్వానికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా లేఖలు టిడిపి ఆవిర్భావ సభలోనే ప్రకటించారు. ఈ రాజీనామాలే కెసిఆర్‌కు తెలంగాణ ప్రజల్లో క్రేజ్‌ను తెచ్చిపెట్టాయి. ఎన్టీఆర్ ఎన్నికలంటే ఉత్సాహ పడేవారు. ఆయన తరువాత ఇలా ఎన్నికలకు ఉత్సాహాన్ని చూపించింది కెసిఆర్.
రాజకీయాల్లో దశాబ్దకాలం తక్కువే కావచ్చు. కానీ ఒక ఉద్యమం దశాబ్ద కాలం పాటు నడిపించడం సామాన్య విషయమేమీ కాదు. తెలంగాణ ఉద్యమం కెసిఆర్‌తోనే ప్రారంభం కాలేదు. ఆయన కన్నా ముందు చాలా మంది ఉద్యమాన్ని సాగించారు. ఎక్కువ రోజులు నడపలేకపోయారు. వైఎస్‌ఆర్ పిసిసి అధ్యక్షునిగా ఉన్నప్పుడే 41 మంది తెలంగాణ ఎమ్మెల్యేలు ఆయన అనుమతితో తెలంగాణ సాధన కోసం సోనియాగాంధీకి వినతిపత్రం ఇచ్చారు. కొన్ని సదస్సులు నిర్వహించి తెలంగాణ ఉద్యమానికి నాంది పలికారు. మేం సీరియస్‌గా ఉద్యమిస్తుంటే కెసిఆర్ సందట్లో సడేమియా అంటూ వచ్చారని టిఆర్‌ఎస్ ఆవిర్భవించినప్పుడు ఉప్పునూతల పురుషోత్తం రెడ్డి కాంగ్రెస్ తెలంగాణ ఉద్యమ సదస్సులో విమర్శించారు. 

ఇప్పుడు తెలంగాణ ఉద్యమం కెసిఆర్ ఆధ్వర్యంలో సాగుతుంటే కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పరిస్థితి సందట్లో సడేమియా అన్నట్టుగా మారింది. కెసిఆర్ కన్నా ముందు కాంగ్రెస్, బిజెపితో పాటు ఇంద్రారెడ్డి తెలంగాణ కోసం ఉద్యమాలు సాగించినా అవి పార్ట్‌టైం రాజకీయాల తరహాలోనే సాగాయి. చెన్నారెడ్డి చేయలేనిది కెసిఆర్ చేస్తారా? అని విమర్శించిన వారికి అర్ధం కాని విధంగా పదేళ్ల నుంచి టిఆర్‌ఎస్ ఉద్యమాన్ని సాగిస్తూనే ఉంది. 1969లో విద్యార్థులు ప్రారంభించిన తెలంగాణ ఉద్యమాన్ని చెన్నారెడ్డి ఏడాదికి మించి నడిపించలేకపోయారు.
 తెలంగాణ కోసం పుట్టిన పార్టీని చెన్నారెడ్డి కాంగ్రెస్‌లో కలిపేశారు. చిత్రంగా ఇప్పుడు తెలంగాణ కోసం పుట్టిన టిఆర్‌ఎస్‌ను కాంగ్రెస్‌లో కలిపేస్తారనే ప్రచారం సాగుతోంది. అయితే అప్పటికీ ఇప్పటికీ చాలా తేడా ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయడానికి కేంద్రం అంగీకరిస్తే, టిఆర్‌ఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేయడానికి సిద్ధం అని కెసిఆర్ ఎప్పటి నుంచో చెబుతూ ఉన్నారు. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తున్నట్టు స్వయంగా కేంద్ర ప్రభుత్వం తరఫున హోంమంత్రి పార్లమెంటులో ప్రకటించే స్థాయి వరకు ఉద్యమాన్ని తీసుకువెళ్లిన క్రెడిట్ కెసిఆర్‌కే దక్కుతుంది. అలా అని ఆయన చేసే వాటన్నింటిని సమర్ధించలేం. అయన వైఖరి ఎలా ఉన్నా, ఆయన చేస్తున్న తప్పులు ఎన్నున్నా కేవలం తెలంగాణ అజెండానే ఆయన్ని కాపాడుతోంది. రాష్ట్రంలోని మరే రాజకీయ పక్షమైనా తన నిర్ణయాన్ని వెంటనే మార్చేసుకుంటుంది. ప్లేటు ఫిరాయించడానికి ఏ మాత్రం సంకోచించదు.

 కానీ టిఆర్‌ఎస్ పుట్టింది తెలంగాణ కోసం, ఆ పార్టీ ఉనికి తెలంగాణలో మాత్రమే ఉంది. అందుకే కెసిఆర్ ఏం చేసినా వాటిని పక్కన పెట్టి తెలంగాణ కోరుకునే వారంతా కెసిఆర్ తప్ప మరో మార్గం లేదనుకుంటున్నారు. కెసిఆర్‌కు గద్దర్‌ను పోటీగా తీసుకురావాలనే ప్రయత్నం జోరుగానే సాగింది. గద్దర్‌ను హైలెట్ చేసిన వారే స్వయంగా సీమాంధ్ర నాయకులు, సీమాంధ్ర వ్యాపారులు తెలంగాణ ఉద్యమం కెసిఆర్ ఆధ్వర్యంలో కాకుండా గద్దర్ ఆధ్వర్యంలో జరగాలని కోరుకుంటున్నారు అని ప్రకటించారు. కెసిఆర్‌ను పక్కకు తప్పిస్తే తెలంగాణ ఉద్యమం చల్లబడిపోతుందనేది చాలా మంది నమ్మకం. ఈ నమ్మకంతో చాలా మంది చేసిన ప్రయత్నాలు కెసిఆర్‌ను మరింత బలపడేందుకు దోహదం చేశాయి. గద్దర్‌ను తెరపైకి తీసుకురావాలని తీవ్రంగా సాగించిన ప్రయత్నాలు కెసిఆర్‌ను మరింత బలపరిచాయి. కెసిఆర్ ఏం మాట్లాడినా సంచలనమే. ఏమీ మాట్లాడకపోయినా సంచలనమే!

 ఆయన మాటలను ఎవరూ నమ్మరనేవారే ఎక్కువగా ఉంటారు. అదే సమయంలో ఆయన మాట్లాడినా, మాట్లాడకపోయినా ఏదో చేస్తున్నారని ఆందోళన చెందేవారు అంత కన్నా ఎక్కువ మంది ఉంటారు. తెలంగాణ ఉద్యమం కెసిఆర్ చేతిలో ఉండొచ్చు కానీ తెలంగాణ వస్తుందా? లేదా? అనే ప్రశ్నకు సరైన సమాధానం మాత్రం సోనియాగాంధీ చేతిలోనే ఉంది. 

2 కామెంట్‌లు:

  1. I enjoy the read and especially the day dream of chandrababu narration is superb.

    రిప్లయితొలగించండి
  2. "తెలంగాణ ఉద్యమం కెసిఆర్ చేతిలో ఉండొచ్చు కానీ తెలంగాణ వస్తుందా? లేదా? అనే ప్రశ్నకు సరైన సమాధానం మాత్రం సోనియాగాంధీ చేతిలోనే ఉంది"

    Wrong on both counts. The movement is now in the hands of the people. They alone can achieve Telangana, not any politicians.

    రిప్లయితొలగించండి

మీ అభిప్రాయానికి స్వాగతం