23, ఏప్రిల్ 2011, శనివారం

దేవుడా ఏమి నా కోరిక

దేవతలకు పాలకుడైన ఇంద్రుడు నిరంతరం తన పదవి కాపాడుకోవడంలోనే మునిగిపోయేవాడట.. ఎవరు తపస్సు చేసినా తన పదవి కోసమేననే భయం ఇంద్రుడికుండేది. నాటి ఇంద్రుడి నుండి నేటి ముఖ్యమంత్రుల వరకు అందరిదీ ఇదే బాధ. ఎవరేం చేసినా తమ పదవికి ఎసరు వస్తుందేమోనని నిరంతరం కలవరపడుతుంటారు.

 తమ పనులు కావాలంటే ఆ శాఖలకు తమ మనుషులే మంత్రులుగా ఉండాలని నీరా రాడియా వంటి శక్తివంతమైన మహిళలను పారిశ్రామిక వేత్తలు ఎలా ఉపయోగించుకుంటారో 2జి స్పెక్ట్రమ్ కుంభకోణంతో తెలిసొచ్చింది. ఇంద్రుడు సైతం ఇలానే ఎవరు తపస్సు చేసినా తన కుర్చీని జాగ్రత్త చేసుకోవడం కోసం రంభా ఊర్వశి మేనకలను పంపే వారు. నీరా రాడియా ఇప్పుడేదో నోయిసి కన్సల్టెన్సీ అని ఏర్పాటు చేసుకున్నట్టు అప్పుడే రంభా ఊర్వశి మేనకలు ఇంద్రుడి కన్సల్టెన్సీ సభ్యులన్న మాట!
ఎవరు తపస్సు చేసినా తన కుర్చీని జాగ్రత్త పర్చుకోవడానికి ఇంద్రుడీ కన్సల్టెన్సీ సభ్యులను వారిపైకి ఉసిగొల్పేవాడు. నీరా రాడియాకు ఎదురు లేనట్టే రంభాఅండ్ కో వెళ్లారంటే ఎంతటి ఘోర తపస్సులో ఉన్న వారైనా వీరి వలలో పడాల్సిందే! అయితే నిజంగా ఆ మునులు ఇంద్రుడి సింహాసనాన్ని ఆశించే అంత ఘోరమైన తపస్సు చేశారంటే నమ్మబుద్ధి కావడం లేదు.

 తుమ్మితే ఊడే ముక్కు లాంటి ఇంద్ర పదవి కోసం ఆశపడతారా? ఏమో ఏ కాలంలోనైనా అధికారం అంటే మక్కువే కదా! అప్పుడు ఎవరు తపస్సు చేసినా ఇంద్రుడు తన కుర్చీ కోసమే అని వణికిపోయినట్టే ఇప్పుడు ముఖ్యమంత్రులు తమ ఎదురుగా ఎవరు కనిపించినా? ఎవరు నోరు మెదిపినా తన కుర్చీలాగేందుకే అని చిరాకు పడుతున్నారు.
 ఏ పుట్టలో ఏ పాముందో అన్నట్టు ఎవరు దేనికి తపస్సు చేస్తున్నారా అంచనా వేయడం కష్టమే కాబట్టి చిన్నపామునైనా పెద్దకర్రతో కొట్టాలన్నట్టు కుర్చీపై కూర్చున్న వారు అందరినీ అనుమానంగా చూస్తునే ఉంటారు. అయినా కోరికలు లేనిది తపస్సు చేసే వారెవరు? కోరికలు లేని సమాజం ఏర్పడాలనే బలమైన కోరికతోనే కదా! బుద్ధుడు తపస్సు చేశాడు.

 రూపాలు మారాయి కానీ కోరికలు తీరాలంటే ఆ కాలం నుండి ఈ కాలం వరకు తపస్సులు తప్పడం లేదు. అప్పుడు గడ్డాలు పెంచుకుని చుట్టూ పుట్టలు పెరిగే వరకు తపస్సు చేసే వారు. ఇది ప్రజాస్వామ్యం కోరికలు తీరాలంటే జనం వద్దకు వెళ్లాల్సిందే, గడ్డం పెరిగేట్టు, కాళ్లు అరిగేట్టు జనం చుట్టు తిరిగి వారిని ప్రసన్నం చేసుకునేందుకు జన తపస్సు చేస్తే కానీ కోరికలు తీరవు.

 ప్రజల మధ్య ఓదార్పు అంటూ తిరిగేది సైతం కోరికలు తీర్చుకోవడానికి సాగించే తపస్సే. కోరికలు తీరాలంటే 40 రోజుల వ్రతం, ఆరు వారాల ఉపవాసం అంటూ రకరకాలుగా ఉంటాయి. ఇవన్నీ చిన్నచిన్న కోరికలకు సంబంధించిన వ్రతాలు. పిల్లలు బాగా చదవాలనో మొగుడి ఉద్యోగం నిలవాలి వీలుంటే ఒక ప్రమోషన్ లభించాలని భార్యలు చేసే చిన్నచిన్న తపస్సులివి. 


ఆ కాలంలో చాలా వేగంగా గడ్డాలు పెరిగిపోయేవి, దేవుళ్ళు తొందరగా ప్రసన్నం అయి వరాలు ఇచ్చేసేవారు. ఏదైనా డిమాండ్ సప్లైను బట్టే ఉంటుంది కదా! అప్పుడున్న ముక్కోటి దేవతలే ఇప్పుడున్నారు. కానీ జనం కోటాను కోట్ల మంది పెరిగిపోయారు. దాంతో తపస్సు చేసే వారి సంఖ్య ఎక్కువ వరాలిచ్చే దేవుళ్ల సంఖ్య తక్కువ కావడంతో అంత సులభంగా కోరికలు తీరడం లేదు. ఇంద్రుడి కుర్చీ సంగతి అటుంచి అమ్మాయి మనసు దోచుకోవడానికి సైతం ఘోరమైన తపస్సు చేసినా ఫలితం ఉండడం లేదు చాలా మందికి దాంతో వాళ్లు తపస్సు మానేసి గడ్డాలు పెంచుతున్నారు. నాయకుడికి సామాన్యుడి కోరిక తుచ్చమైనదనిపించవచ్చు, సామాన్యుడికి తన ప్రేమ ముందు నాయకుడు కుర్చీ కోసం సాగించే తపస్సు అధ్వాన్నమైన కోరిక అనిపించవచ్చు. ఎవరి తపస్సు వారికి ముఖ్యం . నిధిచాల సుఖమా రాముడి సన్నిధి సేవ సుఖమా? అంటే తెలివైన వాడు రాముడి సన్నిధి సుఖమనాలి.. దేవుడు మెచ్చి నిధీ ఇస్తాడు, తన సన్నిధీ ప్రసాదిస్తాడు. ఐఐటి చేయాలని ఎల్‌కెజిలో చేరినప్పుడు నిర్ణయించుకున్నట్టు తపస్సు మొదలు పెట్టినప్పుడే ఏం కోరాలి, దేవున్ని ఎలా ప్రసన్నం చేసుకోవాలో- సరైన విజన్ ఉండాలి. అందుకే దేవుడా ఏమి నా కోరిక అని దేవుణ్ణి ముందుగానే అడిగి తీరుస్తననె గ్యారంటి తీసుకోని తపస్సు ప్రారంభిస్తే పుణ్యం పురుశార్త్ధం 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయానికి స్వాగతం