6, ఏప్రిల్ 2011, బుధవారం

హైదరాబాద్ నగరంలో...మసాలా కథా నిలయాలు

కాళీపట్నం రామారావు కథా నిలయంలో దశాబ్దాల క్రితం రాసిన కథలు దొరుకుతాయేమో కానీ నగరంలోని రాజకీయ పార్టీల కథా నిలయాల్లో అప్పటికప్పుడు వేడివేడి జిలేబీల్లా మన ముందే కథను తయారు చేసి వినిపిస్తారు. కథలు రాయాలనుకున్న వారు కథలకు ఐడియాల కోసం కంచికి వెళితే అక్కడ పట్టుచీరలు దొరుకుతాయి కానీ కథలు దొరకవు. శ్రీకాకుళం కథానిలయానికి వెళితే పాత కథలు చదివి జీర్ణం చేసుకుని కొత్త కథ రాయడం కొంచం కష్టమైన పనే. కథల కోసం మహాభారతాన్ని నమ్ముకుందామా? అంటే తెలుగు సినిమా రంగంలో సూపర్ హిట్ కథా రచయిత, కమ్ డైలాగ్ రైటర్, కమ్ యాక్టర్ బ్రదర్స్ మహాభారతాన్ని ఎంత పిండుకోవాలో అంత పిండుకున్నారు. కవిత్రయానికైనా కాపీరైట్ హక్కులు లేవేమో కానీ తెలుగుసినీ రంగంలో మహాభారతం ఆధారంగా నేటి భారతం రాయడానికి ఈ సోదరులకే పూర్తి హక్కులున్నాయి. చాలా మంది పోలీస్ స్టేషన్‌లో కథలు దొరుకతాయని అనుకుంటారు . వాళ్ల కథకు ఫార్మెట్ ముందుగానే సిద్ధమై ఉండడం వల్ల ఇప్పుడంతగా ఆకర్శించడం లేదు. ఒకటి మచ్చుకు చూడండి.
***
రాత్రి సమయంలో పహారాకు వెళుతుండగా, ఒక మనుషుడు అనుమానస్పదంగా కనిపించారు. ఓరుూ పౌరుడా! నీవు ఎవరవు? ఇంత అర్థరాత్రి వేళ ఎచటకు పోవు చున్నావు? అని ప్రశ్నింగా, ఆ పౌరుడు సమాధానం చెప్పకుండా దురుసుగా వెళ్లిపోసాగాడు. ప్రజల క్షేమమే మాకు ముఖ్యం, విధి నిర్వహణలో భాగంగా మేము మిమ్ము ప్రశ్నించుచుంటిమి సమాధానం చెప్పడం పౌరుడిగా మీ విధి? అని పౌరుడిని గౌరవంగా అడిగితిమి. ఇంతలో హఠాత్తుగా కాల్పులు జరిపెను, ఆత్మరక్షణ కోసం మేముయూ కాల్పులు జరిపితిమి? కాల్పులు ముగిసిన తరువాత చూడగా......’’ ఇలా సాగుతుంది పోలీసులు చెప్పే కథ. రక్తికట్టాలంటే సస్పెన్స్ ఉండాలి.
***
మరి ఆసక్తి కలిగించే వేడివేడి కథలు ఎక్కడ లభిస్తాయంటారా? హైదరాబాద్ నగరంలో అన్ని రాజకీయ పక్షాలకు కార్యాలయాలున్నాయి. కథా రచయితలకు రాజకీయాల పక్షాల పట్ల పెద్దగా గౌరవ భావం ఉండదు, ఆసక్తి ఉండదు. దాంతో వారు అటువైపు తొంగి చూడరు. కానీ వీలును చూసుకుని రాజకీయ పార్టీల కార్యాలయాలను సందర్శిస్తే కాళీపట్నం రామారావు కథాలయాన్ని తలదనే్న కథాలయాలు ఇక్కడే బోలెడు ఉన్నాయని ఒప్పుకుని తీరాల్సిందే. రాజకీయ కథానిలయాల్లో ఎప్పుడో వండేసిన కథలు కాకుండా మన కళ్లముందే క్షణాల్లో చక్కగా వండివడ్డిస్తారు. అప్పటికప్పుడు వండినా రుచిలో రాజీ పడరు. రాజకీయ కథానిలయాల్లో మచ్చుకు కొన్ని కథలు
***
‘తెలుగు’ కథా నిలయం మిగిలిన అన్నింటికన్నా హాట్‌హాట్ కథలకు పెట్టింది పేరు. ఇక్కడ కథలు ముందు తెలుగులో పుట్టి తరువాత ఇంగ్లీష్‌లోకి తర్జుమా చేయిస్తారు. అసెంబ్లీ సమావేశంలో టిడిపి ఎమ్మెల్యేలు వైఎస్‌ఆర్‌ను వ్యక్తిగతంగా దూషిస్తుండడంతో కోపం పట్టలేక మంత్రి వివేకానందరెడ్డి టిడిపి ఎమ్మెల్యేలపై దాడికి దిగారు. దాడి జరిపి ఆ మంత్రి ఇంకా తన సీటు వద్దకు కూడా చేరుకోలేదు. తెలుగు భవనంలో దీనిపై చక్కని కథ వినిపించింది. ఆ కథా సారాంశం ఏమంటే వివేకానందరెడ్డికి కుటుంబ సభ్యులెవరికీ ఆయన కాంగ్రెస్ తరఫున ఉప ఎన్నికల్లో పోటీ చేయడం ఇష్టం లేదు. పోటీ నుంచి ఎలా తప్పుకుందామా? అని ఆయన ఆలోచిస్తున్నారు. వివేకానంద భార్యా పిల్లలకు జగన్ అంటే వల్లమాలిన అభిమానం అతనికి వ్యతిరేకంగా పోటీ చేస్తే సహించేది లేదని చెప్పారు. దాంతో పథకం ఆలోచించిన వివేకా అసెంబ్లీలో టిడిపి ఎమ్మెల్యేలపై దాడి జరిపారు. క్షణాల్లో అల్లిని ఈ కథను విన్నవారు కథ చెప్పిన వారి ఊహాశక్తిని అభినందించకుండా ఉండలేకపోయారు. అవధానాల్లో అప్పటికప్పుడు సమస్యను పూరిస్తారు అదే గొప్ప విద్య అనుకుంటే అంత కన్నా తక్కువ సమయంలో ఇంత చక్కని కథ అల్లాలంటే బోలెడు జ్ఞానం అవసరం. దేవేందర్‌గౌడ్ అనే నాయకుడు తెలుగుభవనం వీడి సొంత భవనాన్ని నిర్మించుకున్న తరువాత అతని గురించి వినిపించిన కథలు ఆ చెవిన ఈ చెవిన పడి చివరకు ఆయన చెవిలో కూడా పడ్డాయి. కథలు చెప్పిన వారి ఊహాశక్తికి ఆయనా ముచ్చటపడిపోయారు. గౌడ్ గారి వందల ఎకరాల భూమిని కాపాడుకోవాలంటే తెలుగు పార్టీని వీడివెళ్లాల్సిందేనని వైఎస్‌ఆర్ షరతు విధించారు. మరి అతను మళ్లీ తిరిగి సొంత గూటికి వచ్చాడు కదా? అంటే ఔను ఆనాటి వైఎస్‌ఆర్ ఒప్పందంలో ఇది కూడా భాగమే అని కథ చెబుతారు. కథల బాధితులు సైతం ఈ భవనంలోకి అడుగుపెట్టగానే చక్కని కథలల్లేయ గలరు. కెసిఆర్ కూతురు దగ్గర లెక్కలేనంత డబ్బు మూలుగుతోంది ఈ మధ్య కొందరు పారిశ్రామిక వేత్తలు చెప్పారు. కెసిఆర్ కూతురు డబ్బు మూటలతో వచ్చి మీ వ్యాపారంలో నేను భాగస్వామిగా ఉంటానని మంకు పట్టుపట్టిందట! డబ్బునిలా సంచుల్లో తేవద్దు చెక్కు రూపంలో తీసుకురా అని వాళ్లు తిప్పి పంపారట! తెలుగు భవనానికి తిరిగి వచ్చిన గౌడ్, రెడ్డి ధ్వయం చెప్పిన కొత్త కథ ఇది. కొన్ని కథలు బహిరంగంగా కాకుండా చెవిలో చెబుతుంటారు. కెసిఆర్‌కు ఒక పెద్ద పడవ, సముద్రంలో కొంత భాగం ఇచ్చారు, త్వరలోనే అతనికి కేంద్రంలో మంత్రి పదవి ఇస్తున్నారు ఇది చాలా కాలం నుంచి తెలుగు భవనంలో వినిపిస్తున్న చెవిలో చెప్పే కథ.
***
ఈ స్థాయిలో కాకపోయినా అంతో ఇంతో ఇతర భవనాల్లో సైతం కథలు వినిపిస్తుంటాయి. జూన్‌లో తెలంగాణ ఖాయం ఇప్పుడే సోనియాగాంధీ ఫోన్ చేసి చెప్పారు. ఇది గులాబీ భవనం కథ అని వేరే చెప్పాల్సిన అవసరం లేదు.
***
తెలంగాణ ఇచ్చేయడానికే మేడం సుముఖంగా ఉన్నారు, అలానే ముఖ్యమంత్రిని మార్చేస్తున్నారు ఇది హస్త్భవన్ కథ.
మీలాంటి గుంటనక్కలు చెప్పిన మాట విని జగన్ లాంటి మహోన్నత నాయకున్ని బయటకు పంపించాను అని సోనియాగాంధీ ఆవేదన చెందుతూ సీనియర్లపై మండిపడ్డారు. ఇది జగన్ శిబిరం వినిపిస్తున్న మధుర కథ.
ముక్తాయింపు: ఈ కథల్లో నిజమెంతా? అంటే మీడియా వార్తల్లోనే నిజాలు వెతకడం మానేసిన రోజుల్లో కథల్లో నిజాల శాతం ఎంత? అని ప్రశ్నించడం అన్యాయం.

1 కామెంట్‌:

  1. మీలాంటి గుంటనక్కలు చెప్పిన మాట విని జగన్ లాంటి మహోన్నత నాయకున్ని బయటకు పంపించాను అని సోనియాగాంధీ ఆవేదన చెందుతూ సీనియర్లపై మండిపడ్డారు. ఇది జగన్ శిబిరం వినిపిస్తున్న మధుర కథ.

    :D

    రిప్లయితొలగించండి

మీ అభిప్రాయానికి స్వాగతం