18, ఏప్రిల్ 2011, సోమవారం

అంబానీ సోదరులు హీరోలుగా మల్టీస్టార్ సినిమాలో నటిస్తే ఎలా ఉంటుంది?

అనిల్ అంబానీ పిడికిలి బిగించి ఒక్క గుద్దు గుద్దడంతో పాతిక మంది గాలిలో ఎగిరిపోయారు. కాలిని నేలపై బలంగా కొట్టగానే ఐదారు సుమోలు గాలిలో లేచాయి. అనీల్ అంబానీ వీరవిహారానికి అక్కడున్న గాలి ఒక్కసారిగా కమ్ముకుంది. విలన్ విస్తుపోయాడు.
 హీరోయిన్ మురిసిపోయి అనిల్ చేయి పట్టుకుని తన్మయంగా చూసింది. ఒక చేతితో హీరోయిన్ చేయి పట్టుకున్న అనిల్ మరో చేతితో విలన్ మెడ పట్టుకున్నాడు. వెనక నుండి పొడిచేందుకు కత్తిపైకెత్తిన విలన్ ముఖ్య అనుచరుడిని చేతిలోని కత్తిని కంటి చూపుతో ముక్కలు చేశాడు.
అమితాబ్ గోవిందలు బడేమియా చోటే మియాలో కలిసి నటించినట్టు అంబానీ సోదరులు హీరోలుగా మల్టీస్టార్ సినిమాలో నటిస్తే ఎలా ఉంటుంది? బహుశా వాళ్లింట్లో వాళ్లు కూడా ఆ సినిమా చూసేందుకు ఇష్టపడరేమో కదూ! ఇప్పుడు దేశంలోకెల్లా సంపన్నులుగా నిలిచి మరో రెండు మూడేళ్లలో ప్రపంచంలోనే నంబర్ వన్ సంపన్న కుటుంబంగా ఎదగనున్న అంబానీలు ఏ వ్యాపారంలో అడుగుపెట్టినా ఎదురు లేకపోవచ్చు. అంత మాత్రాన హీరోలుగా కూడా వారు రాణిస్తారనుకుంటే అమాయకత్వమే అవుతుంది. ఒక రంగంలో అత్యున్నత స్థాయికి వెళ్లిన వారు ఏ రంగంలో అడుగుపెట్టినా నెట్టుకొస్తారని కొందరు గట్టిగా నమ్ముతారు. అమితాబ్ సినిమాల్లో నంబర్ వన్ స్థానంలో ఉన్నప్పుడు తన పేరుమీదనే ఒక భారీ కంపెనీ ఏర్పాటు చేసి దివాళా తీసేశారు. చివరకు మళ్లీ నటననే నమ్ముకుని అప్పులు తీర్చి బోలెడు సంపాదించారు. 67 ఏళ్ల వయసులో కూడా ఇప్పుడాయన ప్రకటనల్లో, నటనలో, టీవి కార్యక్రమాల్లో అత్యధిక పారితోషకం తీసుకునే నటునిగా నిలిచారు.
అంబానీలు నటించలేరు, నేను వ్యాపారం చేయలేను అనే జీవన సత్యం బోధపడిన తరువాత అమితాబ్ బుద్ధిగా నటనకే పరిమితం అయ్యారు. పోయిన చోటే వెతుక్కోవాలని మన వాళ్లు ఊరికే అనలేదు. అలానే టిఆర్‌ఎస్ అధ్యక్షుడు కెసిఆర్ పాట పాడితే ఎలా ఉంటుంది?

 ఇప్పుడున్న నాయకుల్లో అద్భుతమైన వాగ్దాటి గల నాయకుడు ఆయనే. సూటిగా ఏం చెప్పాలో? ఎంత వరకు చెప్పాలో? ఆయనకు తెలిసినంతగా ఇప్పటి నాయకులెవరికీ తెలియదు. కొందరు నాయకులు మాట్లాడుతుంటే అబ్బా ఇంకెంత సేపు మాట్లాడతారు అని వాచీవంక చూసుకోవలసి ఉంటుంది. మీరు వాచి వంక చూసినా క్యాలండర్ వైపు చూసినా మేం మాట్లాడాలనుకున్నంత సేపు మాట్లాడేస్తాం అన్నట్టుగా ఉంటుంది వారి దోరణి. కానీ కెసిఆర్ ఉపన్యాసం ఐపోతే ఏంటి అప్పుడే ఐపోయిందా? అనుకునేట్టుగా ఉంటుంది. తెలుగులోనే కాదు ఉర్దూ, ఇంగ్లిష్ భాషల్లో సైతం ఆయన అలానే మాట్లాడతారు. 


తెలుగులో ఐతే తెలంగాణ మాండలికలు, సామెతలు గుప్పిస్తారు. ఉర్దూ షాహెరీలతో మైనారిటీలను ఆనందంలో ముంచెత్తుతారు. అలా అని ఆయన పాట పాడారనుకోండి ఎలా ఉంటుంది? ఆ సాహసం ఆయన చేయలేదు, ప్రేక్షకులు అసలే చేయలేరు. ఆ సంగతి ఆయనకు తెలుసు కాబట్టి ఆ ప్రయత్నం ఆయన చేయడం లేదు. 


అలానే గద్దర్ పాడితే ఎవరికైనా చిందేయాలనిపిస్తుంది. అద్భుతమైన గాయకుడు రాజకీయాల్లో రాణిస్తాడా? ఏమో ఆయన మాత్రం పాటల్లో రాణించినప్పుడు రాజకీయాల్లో ఎందుకు రాణించలేనని అంటున్నారు. ఆయన రాజకీయ ఆరంగ్రేటమే వివాదాస్పదంగా మారింది. రాజకీయ అవతారం ఎత్తాలనుకున్న ఆయన ఫ్రంట్ పెడితే పోటీ చేయాలని కొందరు, వద్దే వద్దని కొందరు రెండు వర్గాలుగా చీలిపోయారు. 
పార్టీనో ఫ్రంటో తేల్చి చెప్పండని కొందరడుగుతున్నారు. రాజకీయ అవతారం దాల్చాలని ఆయనకు బలంగా ఉన్నా మెజారిటీ అభిమానులు పోటీ వద్దనడంతో ఆయన ఎటూ తేల్చడం లేదు. అక్షరాలతో రక్తాన్ని ఎలా ఉడికెత్తించాలో ప్రజలకు చాటి చెప్పిన శ్రీశ్రీ సైతం రాజకీయ అవతారం ఎత్తాలనుకున్నారు. భూ మార్గం పట్టిస్తా, భూ కంపం సృష్టిస్తానని కవిత్వం రాసిన ఆయన రాజకీయాల్లో మాత్రం ప్రభావం చూపలేకపోయారు. తెలుగుభాష ఉన్నంత వరకు ఆయన కవిత్వం ఉంటుంది.
 కానీ ఎన్నికల్లో మాత్రం ఆయన ఒక్కసారి కూడా గెలవలేదు. ఆయన మీద గెలిచిన వారెవరూ జనానికి గుర్తు లేదు కానీ శ్రీశ్రీ మాత్రం రాజకీయాల్లో ఓడిపోయారు. కవిత్వంలో శ్రీశ్రీకి ఎదురు లేకపోవచ్చు కానీ రాజకీయాల్లో మాత్రం స్థానమే లేదు కదా! తెలుగువారింట్లో ఘంటసాల పాట ఉండి తీరుతుంది. అలానే అస్సాంలో బుపెన్ హజారికా పాటల క్యాసెట్ లేని ఇళ్లు లేదు. గౌహతిలో ఆయన్ని దైవంగా ఆరాధిస్తారు. అలాంటి బుపెన్ హజారికా బిజెపి తరఫున పార్లమెంటుకు పోటీ చేస్తే పనె్నండు వందల ఓట్లు వచ్చాయి.
మన దేశంలో, రాష్ట్రంలో వాణిజ్య దిగ్గజాలెవరూ ఎంబిఏ చేసిన వారు కాదు. ధీరూబాయి అంబానీ ఆర్థిక శాస్తవ్రేత్త కాదు, ఆర్థిక శాస్త్రంలో పరిజ్ఞానం లేదు. ఆయన కొడుకులిద్దరు ఆర్థిక శాస్త్రం పాఠాలు ఆరగంట పాటు కూడా బోధించలేరు. కానీ దేశ ఆర్థిక వ్యవస్థ మొత్తం ఆ కుటుంబం చేతిలో ఉంది. చాలా మంది ఆర్థిక శాస్తవ్రేత్తల ఇంటి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంటుంది.

 డబ్బు సంపాదించడం వేరు ఆర్థిక శాస్త్రం పాఠాలు చెప్పడం వేరు. ఎంఎ పొలిటికల్ సైన్స్ చేస్తే ఏ కాలేజీలోనూ పార్ట్‌టైం లెక్చరర్‌గా ఉద్యోగం దొరకవచ్చు అంతే కానీ రాజకీయాల్లో రాణించాలంటే ఎంఎ చదవాలనుకోవడం అమాయకత్వం. ప్రధానమంత్రి మన్ మోహన్‌సింగ్ ఆర్థిక శాస్త్రంలో నిష్ణాతులు. రాజకీయాల కన్నా ఆయనకు ఆర్థిక శాస్త్రం పాఠాలు చెప్పడమే ఎక్కువ ఆసక్తి. కానీ ఆయన సొంత ఆర్థిక పరిస్థితి మాత్రం అంతంత మాత్రమే. అంతెందుకు ? నటనలో అవకాశాలు రాని వారు తమ వైఫల్యాలను పాఠాలుగా మార్చుకుని ఎలా నటించాలో ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లు ఏర్పాటు చేసి నేర్పిస్తుంటారు.
ఎవరు ఏ రంగంలో రాణించగలరో ఎవరికి వారే సరైన అంచనా వేసుకోవడమే అసలైన జ్ఞానం. ఈ జ్ఞానం లేకపోవడమే జీవితంలో పెద్ద లోపం. *

2 వ్యాఖ్యలు:

  1. బాగుందండీ. వేర్వేరు టాపిక్స్ ఎంచుకుని చక్కగా రాస్తున్నారు.

    శ్రీరాగ

    ప్రత్యుత్తరంతొలగించు
  2. థాంక్స్ అండీ శ్రీ రాగ గారు మీ కో చిన్న పరీక్ష మీ బ్లాగ్ పేరేమిటో చెప్పుకోండి చుద్దాం

    ప్రత్యుత్తరంతొలగించు

మీ అభిప్రాయానికి స్వాగతం