17, ఏప్రిల్ 2011, ఆదివారం

నమ్మకమే జీవితం - రాజకీయమే నమ్మకం

ఒక్క క్షణం ఉండు డార్లింగ్- అంటూ సీతయ్య తన చేతిలోని సీసాను బీరువాలో పెట్టి తాళం వేసి పడకమీదికి వచ్చాడు. ‘‘ఎన్నాళ్ల నుంచో అడుగుతున్నాను. అందులో ఉన్న రహస్యం ఏమిటో చెప్పరా?’’ అంటూ మందాకిని గోముగా అడిగింది. 
‘‘నా కుడిచేయితో చేసిన పనులు ఎడమ చేతికి తెలియొద్దనుకుంటాను. మాయలపకీరు తన ప్రాణం చిలకలో ఉందని చెప్పి తన గొయ్యి తానే తవ్వుకున్నాడు. అలానే నువ్వు నాతో ఆ రహస్యాన్ని చెప్పించాలని ప్రయత్నించకు. నేనింత కాలం రాజకీయాల్లో ఇలా నెట్టుకురావడానికి ఈ సీసానే కారణం. 


ఇంటింటికి తిరిగి పాత పేపర్లు కొంటూ జీవితాన్ని ప్రారంభించిన నేను ఈరోజు అవే పత్రికల్లో మొదటి పేజీ వార్తలుగా నిలవడానికి కారణం ఆ సీసాలోనే ఉంది. ఏమైనా అడుగు ఆ ఒక్కటి మాత్రం అడక్కు’’ అంటూ సీతయ్య మురిపెంగా మందాకిని దగ్గరకు తీసుకున్నాడు. సీతయ్యతో మాట్లాడుతున్నా మందాకిని మనసంతా ఆబీరువాలోని సీసాపైనే ఉంది.
సీతయ్య గాఢనిద్రలో ఉన్నాడని నిర్ధారించుకున్న మందాకిని మెల్లగా బీరువా తెరిచి రహస్యాన్ని చేధించింది. ఆ కవరులో ఓ సీసా దొరికింది. సీసా తెరిచి చూస్తే అందులో ఏమీ లేదు ఖాళీగా ఉంది. అప్పటి వరకు గాఢ నిద్రలో ఉన్న సీతయ్య సీసా మూత తెరవగానే తట్టి లేపినట్టుగా తనంతట తానే లేచి కూర్చున్నాడు. ‘‘వారించినా రహస్యాన్ని తెలుసుకున్నావా?’’ అని చిరుకోపంతో ప్రశ్నించాడు.


 ‘‘ ఖాళీ సీసా ఓ రహస్యమా?’’అని మందాకిని అడిగింది. పిచ్చిదానా అది ఖాళీ సీసా కాదే.. నా జీవితాన్ని ఎంతో ఎత్తుకు తీసుకెళ్లిన అదృష్ట దేవత. నీవు తెరవకముందు అందులో నమ్మకం ఉంది. ఇప్పుడు నా చేతిలోకి వచ్చింది కాబట్టి ఆ నమ్మకం మళ్లీ సీసాలోకి వెళ్లింది.
 ఈ నమ్మకమేనే నన్నీ స్థాయికి తెచ్చింది. ఒక రుషి నాకీ సీసా ఇచ్చి- ఇందులో నమ్మకం మంత్రం ఉంది. ఇది నీ వద్ద ఉన్నంత వరకు నీవే పని చేసినా విజయం సాధిస్తావన్నాడు.- పాత పేపర్లు ఎంత కాలం కొంటాం మనమే పేపర్లొకి ఎక్కాలి అని రాజకీయాల్లోకి వచ్చాను. చిత్రంగా నమ్మకమే నన్ను గెలిపించింది. కొంత కాలం తరువాత , సీసా ఉన్నా లేకున్నా రాజకీయాల్లో నాకు ఎదురులేదని నిర్ణయించుకున్నాను. ఇదే విషయాన్ని రుషికి చెబితే ఆయనా చిరునవ్వు నవ్వి.
 నీవిప్పుడు సంపూర్ణమైన రాజకీయ నాయకుడివై పోయావు, ఈ సీసా అవసరం నీకు లేదు, కానీ ఎప్పుడైనా రాజకీయాల్లో ఓడిపోతాను అని నీమీద నీకు నమ్మకం సడిలిపోతే అప్పుడీ సీసాను నమ్ముకో అని రుషి చెప్పాడు.- అంటూ సీతయ్య తన సీసా రహస్యాన్ని విప్పిచెప్పాడు.
సీతయ్య చెత్త పేపర్ల జీవితాన్ని విన్న మందాకిని ఆశ్చర్యంతో ‘‘నిజంగా నమ్మకం అంత పని చేస్తుందంటారా?’’ అని అనుమానం వ్యక్తం చేసింది. ‘‘పిచ్చి మందాకినీ ఈ చరా చర విశ్వం నడిచేది నమ్మకంపైనే. మందాకిని నన్ను మాత్రమే ప్రేమిస్తుందని నేను నమ్ముతాను, సీతయ్య నన్ను విడిచి పోడని నువ్వు నమ్ముతావు. ఈ నమ్మకం లేకపోతే మన బంధమే లేదు కదా! మనిద్దరికీ ఒకరిపై ఒకరికి బోలెడు అనుమానం అయినా కలిసుండాలంటే నమ్మకం తప్పదు.
 నమ్మకాన్ని నమ్మకపోతే రాజకీయాల్లో ఒక్క రోజు కూడా ఉండలేం. దేవుళ్లకైనా తమపై తమకు నమ్మకం ఉండకపోవచ్చు. రాజకీయాల్లో ఉన్నవారికి నమ్మకమే జీవితం. పార్టీలో ప్రతి ఒక్కడికి ఏదో ఒక నాడు రాజ్యసభ దక్కకపోతుందా? అనే గట్టి నమ్మకం ఉంటుంది. ఆ నమ్మకంతోనే వాళ్లు మనకు జీవితాంతం జై కొడతారు. నమ్మకం పోయాక చింతామణి చేతిలో దెబ్బతిన్నవాడికి అంతా అయిపోయిన తరువాత జ్ఞానోదయం కలిగి, పక్కకు తప్పుకుంటారు. ఆ స్థానాన్ని కొత్త వాళ్లతో భర్తీ చేస్తాం.
 వాళ్లు తమకు ఓపికున్నంత వరకు అదే నమ్మకంతో మన కోసం పని చేస్తారు. కొందరు అసలు విషయాన్ని గ్రహించి ఛీ..్ఛ... ఈ నాయకుడికి కృతజ్ఞత లేదు.. యూజ్ అండ్ త్రో ఇతని పాలసీ అని తిట్టి వెళ్లిపోతారు.
 అయినా మనను నమ్మందుకే పెద్ద సంఖ్యలో జనం ఎప్పుడూ ఉంటూనే ఉంటారు. అలా తిట్టిన వారే కొన్నాళ్ల తరువాత కొత్త నమ్మకంతో మళ్లీ మన చెంతకు రావచ్చు. హనుమంతుడికి సముద్రాన్ని దూకేంత శక్తి ఉందని ఆయనకు తప్ప అందరికీ తెలుసు. అదే రాజకీయాల్లో అయితే ఆ నాయకుడు తనకు లేని బలాన్ని విపరీతంగా ఊహించుకుంటాడు. అంత బలవంతుడైన తెల్లోడిపై బక్కపల్చగా కనిపించే మహాత్మాగాంధీ విజయం సాధిస్తాడా? అనే డౌటుంటే స్వాతంత్య్ర పోరాటమే సాగేది కాదు కదా
! గాంధీ విజయం సాధిస్తాడు అని కోట్లాది మంది భారతీయులకు నమ్మకం ఉండబట్టే కదా! మహాత్ముని నాయకత్వంలో ముందడుగు వేసింది. కోట్లాది మంది నమ్మకం కన్నా తాను స్వాతంత్య్రాన్ని సాధించగలను అనే నమ్మకం మహాత్మునికి ఉండడం గొప్ప. అప్పటి వరకు సినిమా రంగానికే పరిమితమైన ఎన్టీఆర్ హేమాహేమీలైన కాంగ్రెస్ నాయకులను ఓడించి అధికారంలోకి వస్తాననే నమ్మకం ఉండబట్టే కదా! రాజకీయాల్లో హీరోగా నిలిచారు. ఇందిరాగాంధీని సైతం తన నిర్ణయాన్ని మార్చుకునేలా చేసిన ఎన్టీఆర్ లాంటి జనాకర్షణ గల ఎన్టీఆర్‌ను అధికారం నుంచి దించి తాను అధికారాన్ని నిలుపుకోగలను అనే నమ్మకం ఉండబట్టే కదా! చంద్రబాబు తొమ్మిదేళ్లపాటు అధికారంలో ఉండగలిగింది


తెలంగాణా రాదు అని ఆందరూ చెప్పిన వస్తుంది అనే నమ్మకం తోనే కదా కెసిఆర్ తెలంగాణా ఉద్యమం మొదలు పెట్టింది . కెసిఆర్ లో ఆ నమ్మకం లేక పోయి ఉంటె ఇప్పుడు ఆందరూ టిడిపి నాయకుల్లానే టిడిపి ఆఫీసులో రోజు కో విలేకరుల సమావేశం పెట్టి బాబు ఎవరిని తిట్టమంటే వారిని తిట్టి వెళ్లి పోయేవాడు కదా నమ్మకమే అతన్ని నాయకుడిగా నిలబెట్టింది . జగన్ సోనియాను ఎదిరిస్తున్నడంటే  ప్రజలు తన వైపు ఉన్నారనే నమ్మకమే కదా ’’ అంటూ సీతయ్యతన ఉపన్యాసాన్ని ముగించాడు.


శ్రీకృష్ణుడి భగవద్గీతను విన్న అర్జునుడిలా సీతయ్య ఉపన్యాసాన్ని మందాకిని సావధానంగా వింది. ‘‘మీరింత జ్ఞానులు కదా! మరెందుకండి ఎన్నికల్లో పదే పదే ఓడిపోతున్నారు’’ అని మందాకిని అడిగింది. ‘‘పిచ్చి మందాకిని గెలుస్తానని నాకు నమ్మకం ఉంటే సరిపోదు ఆ నమ్మకం ఓటేసేవారికి సైతం ఉండాలి రెండు నమ్మకాలు మ్యాచ్ అయితేనే విజయం ’’ అని చెప్పాడు.


 ‘‘నిజమే నండి అద్దంలో చూసుకుంటే నేను ఐశ్వర్యారాయ్ అంత అందంగా ఉన్నాననే నమ్మకం నాకు కలుగుతుంది. కానీ ఇతరులెవరూ దీన్ని నమ్మడం లేదు అని మందాకిని దిగులుగా చెప్పింది. **

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయానికి స్వాగతం