30, ఏప్రిల్ 2011, శనివారం

సంతాన సాఫల్య కేంద్రాలు.......రాజకీయ సాఫల్య కేంద్రాలు

గంపెడు పిల్లాపాపలతో నూరేళ్లు సంతోషంగా జీవించు అని పూర్వం ఆశీర్వదించేవారు.  తరువాత ఇద్దరు లేక ముగ్గురు చాలు అన్నారు. అదీ మారి మేమిద్దరం మాకిద్దరుతో సరిపుచ్చుకున్నారు. ఆ తరువాత మేమిద్దరం, మేమే విడివిడిగా ఉంటాం ఇక మరొకరు మాకెందుకు అనుకుంటున్నారు. ప్రకృతి కూడా అదే దారిలో పయనించడంతో ఇప్పుడు లబోదిబో మంటూ మాకు పిల్లలు కావాలంటూ సంతాన సాఫల్య కేంద్రాలకు పరుగులు పెడుతున్నారు. డిమాండ్‌ను బట్టే వ్యాపారం ఉంటుంది. ఇప్పుడు సంతాన సాఫల్య కేంద్రాలకున్నంత డిమాండ్ మరోదానికి లేదు. భార్యాభర్తలు అస్సలు కష్టపడాల్సిన అవసరం లేకుండా కోరిన సమయంలో కోరిన ముఖ కవళికలతో పిల్లలను సప్లై చేస్తామనే కేంద్రాలు త్వరలోనే వచ్చినా రావచ్చు.
సంతానం లేని వారికి సంతాన సాఫల్య కేంద్రాలు వచ్చినట్టుగానే అన్నింటికి సాఫల్య కేంద్రాలు రావలసిన అవసరం ఎంతైనా ఉంది. ఆ మధ్య టిఎన్ శేషన్ గారు రాజకీయాల్లో శిక్షణ ఇస్తానంటూ రాజకీయ శిక్షణ కేంద్రాలను ప్రారంభించారు. ఎన్నికల ప్రధాన కమీషనర్‌గా ఉన్నప్పుడు ఆయన ఆయన పేరు వింటేనే జకీయ నాయకులు హడలి పోయారు. ఇప్పుడు మన ఇంటి గోడలకు సున్నం వేస్తే ఏడాది తరువాత కూడా తెల్లగా ఉండసడానికి కారణం శేషన్ కారణం. గోడల మీద నాయకులు రాతలు రాస్తే రంగుపడుద్ది అని ఆయన హెచ్చరించడంతో గోడలు వేసిన రంగులోనే ఉన్నాయి.



 ఆయనకు ఎన్నికలకు సంబంధించిన చట్టాలు బాగానే తెలిసినా రాజకీయనాయకుల తత్వం ఏ మాత్రం ఒంటబట్టలేదు. అందుకే ఆయన రాజకీయ కళాశాల మొదటి ఏడాదిలోనే దివాళా తీసింది. చిన్నపాటి మార్పుతో ఆయనే కాదు ఎవరైనా రాజకీయ వ్యాపారం బ్రహ్మాండంగా సాగించవచ్చు. విలువలతో కూడిన రాజకీయాల్లో శిక్షణ ఇస్తామంటే ఆయన వైపు చూసేదెవరు? అలా కాకుండా సంతానం లేని వారికి సంతాన సాఫల్య కేంద్రం వారు అనుసరించిన టెక్నిక్‌నే అనుసరిస్తే కాసుల వర్షం కురిసేది. రాజకీయాల్లో పదవులు కోరుకుంటూ అవి రాకుండా జీవిత కాలమంతా ఉసూరుమంటూ జీవితం చాలించాల్సిన అవసరం లేదు. మా రాజకీయ సాఫల్య కేంద్రంలో చేరండి, పదవులు పొందే మార్గం నేర్పిస్తాం అని ప్రకటించి ఉంటే శేషన్ మార్గంలో వీధికో సాఫల్య కేంద్రం ఏర్పాటై ఉండేది.
రాజకీయ సాఫల్య కేంద్రంలో వచ్చిన వారందరి వద్ద ఫీజులు వసూలు చేయవచ్చు. కొందరికీ పదవులు వస్తే ముందుగానే పర్సంటేజీ సైతం మాట్లాడుకోవచ్చు. ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో పాఠాలు చెప్పేవారినే రాజకీయ సాఫల్య కేంద్రంలో శిక్షణకు ఉపయోగించుకోవచ్చు. 



నటులు దర్జాగా నటశిక్షణాలయాలకు వెళ్లి ఏడాది కాలంలో నేర్చుకునే పాఠాలను నాయకులు మాత్రం రాజకీయాల్లో రెండు మూడు దశాబ్దాలైనా వంట బట్టించుకోవడం లేదు. కొందరు పుట్టుకతో నటులయితే, కొందరు శిక్షణ కేంద్రాల ద్వారా నటులవుతారు. అలానే కొందరు పుట్టుకతోనే రాజకీయాల్లో నటించడం నేర్చుకుంటే చాలా మంది మాత్రం రెండుమూడు దశాబ్దాల పాటు అనేక డక్కా మొక్కీలు తిని నటించడం నేర్చుకుంటున్నారు. అలా కాకుండా రాజకీయ సాఫల్య కేంద్రాల ద్వారా నటనలో మెళుకువలు నేర్చుకోవచ్చు. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చిన కొత్తలో పార్టీ ఆధ్వర్యంలోనే రాజకీయ శిక్షణాలయాన్ని ఏర్పాటు చేశారు. అయితే అంతా అన్నగారి అభిమానులే కావడంతో భగవత్ స్వరూపులు మీ ముందు మేము నటించడమా? అంటూ నటన నేర్చుకోకుండా అభిమానానికే పరిమితం కావడంతో అభిమానులుగానే మిగిలిపోయారు. ఎన్టీఆర్ తన రాజకీయ వారసునిగా బాలకృష్ణ ఉండాలని కోరుకున్నారు. కానీ చిత్రంగా ఎన్టీఆర్ రాజకీయ వారసుని హోదా చంద్రబాబుకు దక్కింది. పదవి లాక్కోవడంలో, నిలబెట్టుకోవడంలో బాబు చూపిన నటనా కౌశలం చివరకు ఎన్టీఆర్‌ను సైతం అబ్బురపరిచింది. నా కన్నా మా అల్లుడు గొప్ప నటుడు అని బహిరంగంగా ఆయన ఒప్పుకోక తప్పలేదు. 


ఆ మధ్య తమిళనాడులో దొంగ చాటుగా దొంగల శిక్షణా లయాన్ని నిర్వహిస్తున్న విషయం బయటపడింది. అందరికీ శిక్షణాలయాలు ఉన్నప్పుడు రాష్ట్రంలో నటన, రాజకీయం కలగలిసిపోయిన సమయంలో నట రాజకీయ శిక్షణాలయం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గతంలో టిడిపి, కాంగ్రెస్ వాళ్లు ఒకరంటే ఒకరు మండిపడేవారు. ఇప్పుడు ప్రాంతీయ ఉద్యమాల పుణ్యమా అని పార్టీలకు అతీతంగా ప్రాంతాల వారిగా నాయకులు జెఎసిల పేరుతో ఏకమవుతున్నారు. అదే స్ఫూర్తితో రాజకీయ నటనాలయంలో అన్ని పార్టీల వారు కలిసి జెఎసిగా ఏర్పాటై శిక్షణ ఇస్తే ఎంత అద్భుతంగా ఉంటుంది. చంద్రబాబు క్లాస్ ముగియగానే ఉపన్యాస కళలో కెసిఆర్ ఉపన్యాసం, ఆ వెంటనే జనాన్ని ఆకట్టుకునే విన్యాసాలపై జగన్మోహన్‌రెడ్డి నటన క్లాస్ ఉంటే ఎంత అద్భుతంగా ఉంటుంది. ఒకవైపు వెంకయ్యనాయుడు ప్రాసలతో ఎదుటి వాడి తల పగలగొట్టడంపై ఉపన్యాసాల్లో మెళుకువలు నేర్పితే, మరోవైపు అర్ధం పర్థం లేకుండా ఎదుటి వాడి బుర్ర వేడెక్కే విధంగా ఎలా మాట్లాడాలో తెలుగు పార్టీ నేతలతో పాఠాలు చెప్పించాలి. మాటలెక్కువ, పని తక్కువ, ఫలితం శూన్యం అంటే ఏమిటో రాఘవులు, నారాయణలను ప్రత్యక్షంగా చూపించి నేర్పించవచ్చు
ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ముఖ్యనాయకులైన రోశయ్య, బాబు, కెసిఆర్, వెంకయ్య, రాఘవులు, నారాయణ అంతా రిటైర్‌మెంట్ వయసు దాటిపోయిన వారే వీరంతా రాజకీయ జెఎసిగా ఏర్పడి నట శిక్షణాలయంలో మెరికల్లాంటి నాయకులను తయారు చేయవచ్చు. రాజకీయాల్లో రిటైర్‌మెంట్‌ను ఏ నాయకుడూ అంగీకరించడు. వీరు సైతం అంతే. అందుకే రాజకీయాల్లో ఉన్నట్టూ ఉంటుంది, ఇటు తమ అనుభవాన్ని శిక్షణ రూపంలో కొత్త వారికి అందించడానికీ అవకాశం ఉంటుంది. వీరికో వ్యాపకం దొరుకుతుంది, ప్రజలకు శాంతి లభించి రాష్ట్రానికి మేలు జరుగుతుంది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయానికి స్వాగతం