15, ఏప్రిల్ 2011, శుక్రవారం

చిన్నిల్లు ...చిన్న భార్య .. చిన్న కారు ... నానో నేతలు

నానో కారు సృష్టించిన సంచలనం ఇంతా అంతా కాదు. అదేం చిత్రమో కానీ మొదటి నుంచి మనుషులకు చిన్నవాటిపై భలే మోజు. ఎంత అందమైన భార్య, పెద్ద భవంతి ఉన్నా చిన్నింటిపైనే మోజు పడతారు.
 సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం నడయాడిన రాజమండ్రిలో సైతం ఆరేడు దశాబ్దాల క్రితం ఎన్ని చిన్నిళ్లు ఉంటే సమాజంలో అంత ఉన్నతుడిగా గౌరవం లభించేది.
 చిన్నింటి అలవాటు ఇప్పుడూ ఉంది కానీ అది బయటపడనివ్వకుండా మోజు తీర్చుకుంటున్నారు. మనిషి ఎంత పెద్దవాడైనా తన చిన్నతనం గుర్తుకు వస్తే సంతోషంలో తేలిపోతాడు. నానో కారు తరువాత నానో టెక్నాలజీని అదేదో కొత్తగా కనిపెట్టారనుకుంటున్నారు కానీ మనిషికి చిన్నవాటిపై ఎనలేని ప్రేమ చిన్ననాటి నుంచే ఉంది.
భర్త కన్నా భార్య వయసు చిన్నగా ఉండాలనే నిబంధన ఎందుకు పెట్టారో ఆలోచించండి. చిన్నవారైతే ఆధిపత్యం చెలాయించవచ్చుననే ఉద్దేశంతోనే ఈ నిబంధన మొదలైంది. భర్త తన భార్య తన కన్నా కనీసం ఒక్క ఏడాదైనా చిన్నగా ఉండాలనుకుంటాడు. చిన్నపిల్లలంటే ఎవరికైనా ఇష్టమే.

 బహుశా తాము చెప్పినట్టు వింటారని, తమకు ఎదురు చెప్పరనే అభిమానం కావచ్చు. తండ్రి కొడుకుల మధ్య సంబంధం బాగా లేకపోయినా తాత మనవడి మధ్య సంబంధం బాగుంటుంది. తాతకు చిన్నవాడని మనవడిపై అభిమానం. పెద్దవాడైనా తాత మనవడి ముందు పిల్లవాడిగానే మారిపోతాడు అందుకేనేమో మనవడికీ తాతంటే అంత ప్రేమ. టీవిలు ముందు చిన్నసైజులో వచ్చి ఇప్పుడు సినిమా తెరంతా పెద్దసైజుకు పెరిగిపోయాయి.
 అదే సెల్‌ఫోన్లు ఫిలిఫ్స్ రేడియో అంత సైజులో వచ్చి ఇప్పుడు చేతి గడియారమంతా సైజుకు చేరుకున్నాయి. ఉన్న సైజు ఉన్నట్టు కాకుండా క్రమంగా పెద్దగానో చిన్నగానో మారుతుంటే అదో ముచ్చట.
ఏమన్నా అంటే అన్నీ వేదాల్లోనే ఉన్నాయని చెప్పినట్టు ఎత్తిపొడుస్తారు కానీ నిజానికి ఈ నానో టెక్నాలజీ పూర్వకాలం నుంచే మన దేశంలో ఉంది.



 ఎంత మంది ఋషులు సూక్ష్మరూపం ధరించి తపస్సు చేశారు, ఎన్నో అద్భుతాలు చేశారు. పురుగులుగా మారి కమండలం నుంచి నీళ్లు బయటకు రాకుండా అడ్డుకున్న కథలు మనకెన్ని లేవు. అంత పెద్ద మనిషి అంత చిన్న పురుగుగా మారాడంటే నానో టెక్నాలజీ కాకుంటే మరేమిటి? డైనోసర్లు విపరిణామ క్రమంలో బల్లిగా మారినట్టు మనుషులు సైతం నానో టెక్నాలజీతో కోతులంత సైజుకు మారితే ఎలా ఉంటుందో? 


ప్రకృతికి అనుగుణంగా జీవుల్లో మార్పు వస్తుంటుంది. కోతి నుంచి మనిషి పుట్టినప్పుడు నానో టెక్నాలజీతో తిరిగి కోతి సైజుకు ఎందుకు మారలేడు? అలా మారితే ప్రపంచంలోని ఆకలి సమస్యంతా తీరిపోతుందేమో! ఒక్క అపార్ట్‌మెంట్‌లోని ఒక్క గదిని అప్పుడు వందల గదులుగా మార్చేయవచ్చు. మనిషి నానోగా మారాడండే హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ ధరలు దెబ్బకు పాతాళంలోకి పడిపోతాయి. వంద గజాల స్థలంలో వేల కుటుంబాలు కాపురముండొచ్చు. హైదరాబాద్ ట్రాఫిక్ సమస్య సైతం తీరిపోతుంది. రోడ్డులు విశాలంగా మారిపోతాయి. అసలు ట్రాఫిక్ జామ్ అంటేనే తెలియదు.


 నానో మనుషులొస్తే జీతాలు తగ్గిస్తారేమో అనే భయం లేకపోలేదు. ఇప్పుడు సైజును బట్టి జీతాలు ఇవ్వడం లేదు కాబట్టి సైజు తగ్గినా జీతాలు తగ్గించవద్దని పోరాటం చేయవచ్చు. పరిణామ క్రమంలో కోతి మనిషిగా మారాడంటే ఇప్పటికీ నమ్మని వారున్నారు కానీ అది వాస్తవం. ఎప్పుడో ఒకప్పుడు పరిణామ క్రమంలో మనిషి నానోగా మారక తప్పదు. అనుమానం ఉంటే చూడండి మనతో సహా మన చుట్టూ ఎంతో మంది నానో మనుషులు కనిపిస్తారు. నానో లక్షణాలు మన నాయకుల్లో చాలా వేగంగా పెరుగుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు సమయంలో హైదరాబాద్ రాష్ట్రాన్ని ఆంధ్రతో కలపడంపై తెలంగాణ నాయకులు, ప్రజలు అనుమానాలు వ్యక్తం చేస్తే అలాంటి అనుమాలు వద్దు అని ఆంధ్రవైపు నుంచి కొందరు పెద్దమనుషులు, తెలంగాణ నుంచి కొందరు పెద్ద మనుషులు చేరి పెద్దమనుషుల ఒప్పందం చేసుకున్నారు.

 ఆ కాలంలో ఆటూ ఇటు డజన్ల కొద్ది పెద్ద మనుషులు కనిపించే వారు. ఇప్పుడు మరో సారి తెలంగాణ వారు ఆనాటి అనుమాలు ఇనాడు నిజమయ్యాయి, మా దారి మేం చూసుకుంటామంటున్నారు. సరే అటు ఇటూ కొందరు పెద్ద మనుషులను కూర్చోబెట్టి మళ్లీ పెద్ద మనుషుల ఒప్పందం చేయవచ్చు కదా? అని ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన పెద్ద మనుషులు అడిగితే మన వాళ్లు గొల్లున నవ్వారు. ఎందుకంటే అక్కడా ఇక్కడా ఒక్క పెద్ద మనిషి కూడా లేడని రెండు ప్రాంతాల వారి మధ్య ఏకాభిప్రాయంతో వ్యక్తమైన అభిప్రాయం.
భారీ కాయాన్ని చూస్తే ‘పెద్ద’మనిషేమోననే భ్రమ కలుగుతుంది కానీ వారు సైజులో పెద్ద తప్ప గుణంలో మాత్రం నానోలేనని క్షణంలోనే తేలిపోతుంది. ఇచ్చిన మాట తప్పనని కర్ణుడు తన స్నేహితుని కోసం ప్రాణాలే అర్పించాడు. ఇచ్చిన మాట తప్పనని ప్రతిజ్ఞ చేసిన హరిశ్చంద్రుడు చివరకు భార్యను సైతం అమ్మేశాడు, కాటికాపరిగా మారాడు. అలాంటి కథలు చెబితే మన నాయకులకు శరీరం మీద పాములు, జెర్ల్రు పాకినట్టుగా ఉంటుంది.

 రాజకీయాల్లో ఉంటూ మాటమీద నిలబడడం ఏమిటని ఇప్పటి మన నానో నేతలు గుర్రు మంటున్నారు. ఎన్నికల కమీషన్ వారు మన ప్రజాప్రతినిధుల ఎన్నికల ఖర్చు జాబితాను విడుదల చేశారు. అశోకగజపతిరాజు గారు లక్షన్నర రూపాయల ఖర్చుతో అసెంబ్లీకి ఎన్నికయ్యారట! రాజుగారు నిరంతరం సిగరేట్ కాలుస్తూనే ఉంటారు. ఎన్నికల ప్రచారంలో బహుశా ఆయన తన సిగరేట్ల ఖర్చు వివరాలను మాత్రమే ఎన్నికల కమీషన్‌కు పంపి ఉంటారు. అత్యధికంగా ఖర్చు చేసింది బాబుగారే. ఆయన ఖర్చు ఎనిమిది లక్షలు. ఇదాయన కారు పెట్రోల్‌కు సరిపోతుంది. ఒక్క నాయకుడు కూడా అసలైన ఖర్చు చూపడు. ఖర్చులో మహా అయితే ఒకటి రెండు శాతాన్ని మాత్రమే చూపిస్తారు. ఈ ఖర్చులు చూస్తే చాలు మన నాయకులంతా నానోలేనని అంగీకరించక తప్పదు. **

4 కామెంట్‌లు:

  1. చాలా బావుందండీ. కానీ ఎన్ని వ్యంగాస్త్రాలు సంధించినా మన వ్యవస్థ లొ మార్పేమీ ఉండదు. రోజు రోజుకీ మనుషుల్లో నైతిక విలువలు తగ్గుతూ పోతున్నాయి.

    మీరన్నట్లుగా మనుషులంతా నానో లైతే బాగుండు బోలెడు సమస్యలు తీరతాయి.

    శ్రీరాగ

    రిప్లయితొలగించండి
  2. శ్రీ రాగ గారు నిజామే నండి నాకు అలానే అనిపిస్తుంది . మనుషులు నానో ఐతే చాల సమశ్యలు ఉండవు . హైదరాబాద్ లో ట్రాఫిక్ సమష్య ఉండదు. సింగిల్ బెడ్ రూం ఫ్లాట్ లో డజన్ జంటలు కాపురం చేయ వచ్చు . అది సరే మీ పేరు మరి అలా నానో చేసరేమిటి . మీ పేరు, మీ బ్లాగ్ పేరు నానో లో కాకుండా పూర్తిగా రాయండి

    రిప్లయితొలగించండి
  3. డైనోసర్లు విపరిణామ క్రమంలో బల్లిగా మారినట్టు మనుషులు సైతం నానో టెక్నాలజీతో కోతులంత సైజుకు మారితే ఎలా ఉంటుందో?
    Fantastic!

    madhuri.

    రిప్లయితొలగించండి
  4. బాబు వినయ్ మనుషులంత సైజు లో ఉన్నప్పుడే కోతుల్లా వ్యవహరిస్తున్నారు ఇక kothi సైజు లోకి మారితే ?

    రిప్లయితొలగించండి

మీ అభిప్రాయానికి స్వాగతం