3, ఏప్రిల్ 2011, ఆదివారం

రామ్ దేవ్ బాబా రాజకీయాలు


రామ్‌దేవ్ బాబా రాజకీయ పార్టీ పెడుతున్నాడట ఎలా ఉంటుందంటావు?- శీర్షాసనంలో ఉన్న శివయ్య ఆసక్తిగా అడిగాడు.

ప్రశాంతాసనం వేసిన రంగారావుకు ఆ మాటలు అస్పష్టంగానే వినిపించినా విషయం అర్ధమైంది.

‘‘వంద కోట్ల మంది జనాభాలో 60 కోట్ల మంది ఓటర్లున్నారు. వీరిలో పది కోట్ల మందైనా యోగాభ్యాసం చేస్తారు. మరో పది కోట్లమందికి యోగాభ్యాసంపై ఆసక్తి ఉంది. ఇక మొత్తం ఓటర్లకు ఆరోగ్యంపై ఎలాగూ ఆసక్తి ఉంటుంది కాబట్టి బాబా రాజకీయ ప్రవేశం మంచి నిర్ణయం.

శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అలాంటిది బాబాకు పార్టీ పెట్టాలనే ఆలోచన ఎందుకొస్తుంది అంతా శివుడాజ్ఞ ’’ అని వజ్రాసనంలో ఉన్న రాజకీయ జీవి రమణ ఆశాభావం వ్యక్తం చేశారు.


‘ఆసనాల్లో కష్టమేంటో శీర్షాసనం వేసిన వారికి తెలుస్తుంది కానీ, వజ్రాసనం వేసిన మీకేం ఎన్ని మాటలైనా మాట్లాడగలరు, బాబాలు రాజకీయ పార్టీ ఏర్పాటు చేయడం అంటే మాటలా’’ అని శీర్షాసనం నుంచి బయటకు వచ్చిన బాబా ఆభిమాని శివయ్య ఆయాసంగా పలికాడు.


‘‘ ఏ పార్టీ విలువ ఆ పార్టీకి ఉన్నట్టు ఏ ఆసనం విలువ ఆ ఆసనానికి ఉంటుంది. ఒక పార్టీ గొప్ప ఒక పార్టీ తక్కువ అని కాదు అన్ని పార్టీల అంతిమ సిద్ధాంతం అధికారమే. ఏ మతంలోనైనా జీవుడు పరమాత్మలో లీనం కావాలని కోరుకున్నట్టుగానే ఏ పార్టీ అయినా కుర్చీలో కూలబడి పోవాలనే కదా!

నదులన్నీ సముద్రంలో కలిసినట్టుగా రాజకీయ పక్షాలన్నీ కుర్చీలోనే లీనమవుతాయి కదా! కుర్చీపై ఆశలేనిది రాజకీయాలెందుకు? ఆరోగ్యం కోసం కాకపోతే ఆసనాలెందుకు?’’ అని వజ్రాసనం నుంచే రమణ ఉపన్యసించారు.

‘‘రాజకీయాలు అలవాటైన వారు పడక గదిలో పట్టెమంచంపై నుంచీకూడ రాజకీయమే మాట్లాడతారు. రెండు పడవలపై ప్రయాణించడం మీ నాయకులకే చెల్లింది, ఇటు వజ్రాసనంలో ఉంటూనే అటు రాజకీయ ఉపన్యాసం చేసేస్తున్నారు’’ అని అప్పటి వరకు వారి ఉపన్యాసం వింటున్న నాటకాలు వేసే నాగయ్య అభినందన పూర్వకంగా పలికాడు.


‘‘మీరు వేసేవి నాటకాలైనా, సినిమా నటులకేం తీసిపోరు మీ మాటలు చూస్తుంటే రాజకీయాల్లోకి వచ్చేట్టుగా ఉన్నారు’’ అని రమణ చమత్కరించారు.‘‘రాజకీయాల్లోకి రావడానికి నాకు ఇంకా వయసేం మించిపోయిందని మొన్ననే కదా! 57 నిండాయి. ప్రజాసేవ చేయాలంటే కనీసం 60 ఏళ్లు నిండాలనేది సంప్రదాయం కదా! ’’


అని నాగయ్య బదులిచ్చాడు. ‘‘ఎలాగూ రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన ఉంది కాబట్టి, అక్కడెక్కడో వరదల్లో గ్రామం మునిగిందట! సహాయ చర్యల్లో పాల్గొనండి, వీలుంటే కనీసం ఓ వంద గ్రాముల రక్తాన్ని దానం చేయండి రాజకీయాల్లోకి వచ్చాక భవిష్యత్తులో ఉపయోగపడుతుంది’’ అని రమణ సలహా ఇచ్చారు.

‘‘ ఆ పని ఎప్పుడో మొదలు పెట్టాను లేండి, మా మేనల్లుడికి పాలమూరులో ప్రాజెక్టు కాంట్రాక్టు దక్కింది పనిలో పనిగా అక్కడికెళ్లి పక్కనే ఉన్న కరవు గ్రామాల్లో నాలుగైదింటిని చూసి గుండె తరక్కుపోయినట్టు మీడియా ముందు ఆవేదన కూడా వ్యక్తం చేశాను.


మీలాంటి సహజ నటులను తట్టుకుని రాజకీయాల్లో నిలబడాలంటే పునాది బలంగా ఉండాలి కదా!’’ అని నాగయ్య ముసిముసి నవ్వుల్తో చెప్పాడు. ‘‘ఇంతకూ బాబా రాజకీయ భవిష్యత్తు ఎలా ఉంటుందంటారు’’ అని శివయ్య కాస్తంత ఆందోళనగానే అడిగాడు. ‘‘అసలు విషయం చెప్పనా’’ అని రమణ తాను చెప్పబోయే విషయంపై అందరిలో ఆసక్తి రేకెత్తించాడు.


చెప్పమన్నట్టు అంతా రమణ వైపు చూశారు. ‘‘ దేశంలో ఇప్పుడున్న బాబాల్లో టాప్ రేంజ్‌లో ఉంది రామ్‌దేవ్ బాబానే ఎంతో మంది సూపర్ స్టార్‌లను మించిన క్రేజి ఇప్పుడాయనకుంది. స్టార్లే ఆయన ముందు తల క్రిందులుగా కూర్చుంటున్నారు, ఆయన తల తిప్పమంటే తిప్పుతున్నారు, పడుకో మంటే పడుకుంటున్నారు, పరిగెత్త మంటే పరిగెత్తుతున్నారు, ఒంటి చేత్తో అటు రాజకీయ నాయకులను, ఇటు సినిమా తారలను ఆడిస్తున్న అదృష్ట జాతకుడు బాబా రాందేవ్ .

ముఖ్యమంత్రులు సైతం బాబా దర్శనం కోసం వేచి చూసే పరిస్థితి. అంతెందుకు సెక్యులరిస్టు లలూకు, బిజెపి వాది మోడీకి అస్సలు పడదు కదా! వీరిద్దరూ బాబా అంటే పడి చస్తారు’’ అని రమణ కాసేపు ఆగాడు.


‘‘ బాబా గొప్పతనంపై మాకెవరికీ అనుమానం లేదు కానీ ఇంతకూ బాబా రాజకీయాల్లోకి ఎందుకు వస్తున్నారో చెప్పలేదు’’ అని శివయ్య మళ్లీ ప్రశ్నించాడు.‘‘అదే చెబుతున్నాను. ఎంతటి గొప్పవాడికైనా ఒక చివరి పాయింట్ అంటూ ఉంటుంది. ఇంత కాలం ఎదగడమే తప్ప పడిపోవడం గురించి బాబాకు తెలియదు. బాబాగా ఇంకా ఎదగడానికి ఏమీ మిగలలేదు. కొండంత ఎదిగిన తరువాత ఇక లోయలో పడాల్సిందే కదా! అందుకే దేవుడు ఆయనకు రాజకీయ పార్టీ పెట్టాలనే ఆలోచన కలిగించాడు ఇంకా అర్ధం కాలేదా?అని రమణ పక పక నవ్వాడు. మీ ముఖాలు చూస్తే నమ్ముతున్నట్టుగా లేదు. ఎంతటి గొప్పవాడైనా ఎదిగిన తరువాత ఇక ఎదగడానికి చోటు లేక లోయలో పడిపోతారు. నిత్యానంద కోసం అమెరికాలో భక్తులు క్యూ కట్టేవారు, ఆయన పరిస్థితి ఇప్పుడు చూడండి. చిరంజీవి సుప్రీం నుంచి మెగా వరకు ఎదిగి చివరకు రాజకీయాల్లో ఎలా మిగిలిపోయాడో చూడండి. అమెరికా అధ్యక్షునితో కలిసి కొత్త ప్రపంచాన్ని సృష్టించాలనుకున్నంత వరకు వెళ్లిన బాబుగారేమయ్యారు. నటనా రంగంలో రారాజుగా వెలిగిపోయిన ఎన్టీఆర్ చివరకు రాజకీయాల్లోకి వచ్చి ఎక్కడి నుంచి ఎక్కడ పడిపోయాడు. సొంత అల్లుడే పదవి లాక్కున్నాడు. పగవాడు సైతం కన్నీళ్లు పెట్టుకునే విధంగా ఆయన జీవితం ముగిసింది కదా! చివరకు దహన సంస్కారాల కోసం కూడా వారసుల మధ్య పోరు తప్పలేదు. చాలా ఇంకా కావాలా?’’ అని రమణ వజ్రాసనం నుంచి లేస్తూ చిద్విలాసంగా నవ్వాడు. ‘‘చాలు బాబోయ్ చాలు రాందేవ్ బాబాకు రాజకీయాల్లోకి రావాలని ఎందుకనిపించిందో బాగా అర్ధమైంది’’ అని అంతా కోరస్‌గా పలికారు.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

మీ అభిప్రాయానికి స్వాగతం