8, ఏప్రిల్ 2011, శుక్రవారం

నేరం చేయడం తప్పు కాదు. తప్పించుకునే మార్గాలు తెలియకపోవడం తప్పు.

కనీసం పది కోట్ల రూపాయలు విలువ చేసే ఆ భవనం కళ్లు తిరగి పోయేంత అద్భుతంగా ఉంది. ఇంజనీర్ ఈశ్వర్‌రావుఅవినీతితో కష్టపడి కట్టుకున్న భవనమది. ఇలాంటి మరో నాలుగైదు భవనాలు, శివార్లలో రెండు సినిమా హాళ్లు, నాలుగైదు డజన్ల ఫ్లాట్లు, రెండు డజన్ల ప్లాట్లు ఆయన సొంతం. జీతం ఎంత అని కాదు... ఉద్యోగాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో ఆయన్ని చూసే ఎవరైనా నేర్చుకోవాలి.

ఆయన శ్రమను గుర్తించకుండా కళ్లు కుట్టిన ఎసిబి వాళ్లు దాడికి బయలు దేరారు. ఈశ్వర్‌రావు తలుపు తెరవగానే ఫ్రమ్ ఎసిబి అంటూ ప్రద్యూమ్న తన ఐడెంటీ కార్డు చూపించాడు. కార్డు చూడగానే ఈశ్వర్‌రావు ఏ మాత్రం తత్తరపడకుండా చిరునవ్వుతో లోనికి వెళ్లి , తానూ ఒక కార్డు చేతిలో పట్టుకుని వచ్చి ఎసిబి అధికారి ప్రద్యూమ్నకు అందజేశాడు. ఇదేంటీ ఏదో కుల సంఘం సభ్యత్వ కార్డులా ఉంది అంటూ ప్రద్యుమ్న అయోమయంగా చూశాడు. మరదే నేను మా కుల సంఘంలో చాలా చురుగ్గా పని చేస్తున్నాను.

ఈ దాడి నా ఇంటిపై జరిగిన దాడి కాదు.. మా కులం ఆత్మగౌరవంపై జరిగిన దాడి ఇది... అవినీతి ఏ ఒక్కరి సొత్తు కాదు... మేమూ చేస్తాం అంటూ ఈశ్వర్‌రావు మీడియాకు ఫోన్ చేయడానికి సెల్‌ఫోన్ చేతిలోకి తీసుకోగానే ఎసిబి అధికారికి ముచ్చమటలు పోశాయి. క్షమించి వదిలేయండి అని ఎసిబి అధికారి వేడుకున్నాడు. కులం కార్డా మజాకానా?-అని ఈశ్వర్ నవ్వుకున్నాడు.


ఏరా చింటూ హోమ్ వర్క్ చేసుకు రాలేదా? మలయాళి టీచర్ ముద్దు ముద్దుగా అడిగిన ప్రశ్నకు చింటూ లేదూ అని చిరాగ్గా సమాధానం చెప్పాడు. కార్టూన్ నెట్ వర్క్ చానల్‌ను చూడనివ్వకుండా వాళ్లమ్మ హోంవర్క్ చేయమని తిట్టడం వాడికి చాలా అవమానకరంగా అనిపించింది.
ఇంట్లో, స్కూల్‌లో తిరుగుబాటు చేయాలనే స్పష్టమైన నిర్ణయంతోనే ఉన్నాడు వాడు. వాడి సమాధానం విన్న మళయాళి టీచర్‌కు చిర్రెత్తుకొచ్చి ఒక్కటిచ్చుకుంది.
దాని కోసమే ఎదురు చూస్తున్న చింటూ గట్టిగా అరుస్తూ తెలుగు ఆత్మగౌరవంపై మళయాళం దాడి సహించేది లేదని అరిచాడు. చాలా కాలం నుంచి చూస్తున్నాను, నా ఫ్రెండ్స్ స్కూల్స్‌లో కూడా అంతేనట! ఎక్కడ చూసినా మీ మళయాల టీచర్లే ఉన్నారు, తెలుగు ఆత్మగౌరవం మీద మీరు పదే పదే దాడి జరపుతున్నారు.

బొందిలో ప్రాణం ఉండగా, తెలుగు ఆత్మగౌరవాన్ని అవమానిస్తే సహించేది లేదు, దీని కోసం జాతీయ స్థాయిలో ఉద్యమిస్తాం అని అరిచాడు. వాడి మాటలు అర్ధం కాక మలయాళి టీచర్ అయోమయంగా చూసింది.

మొదటి షో చూసేయాలని కాలేజీ ఎగ్గొట్టి వచ్చిన కళ్యాణ్ రష్‌ను చూసి నిరాశ పడ్డాడు. మొదటి షో తోనే సినిమా ఎత్తేస్తారేమోనన్నంత కంగారుగా అంతా వచ్చేస్తారు. తీరా రెండు రోజులు గడిచిన తరువాత థియేటర్‌లో జనమే కనిపించరు అని సైకిల్ స్టాండ్ సాయన్న తనలో తానే అనుకుంటున్నాడు.

ఒక్కమెతుకు చూసి అన్నం ఉడికిందని చెప్పినట్టు ఒక్క షోకు జనాన్ని చూసి వంద రోజులు గ్యారంటీ అనుకుంటే వంద రోజుల మాట అటుంచి పాతిక ఆటలు కూడా నడవవు అని అనుభవంతో పక్కవాడికి చెబుతున్నాడు. కళ్యాణ్ మాత్రం ఇవేమీ పట్టించుకునే స్థితిలో లేడు. కళ్లు మూసుకుని క్యూలోకి దూకేశాడు. అప్పటి వరకు క్యూలో ఉన్నవారు ఏం జరిగిందో తెలుసుకునే లోపే కళ్యాణ్ చేతిలోకి సినిమా టికెట్లు వచ్చేశాయ్.

దూరం నుంచే అంతా చూసిన కానిస్టేబుల్‌కు పిచ్చి కోపం వచ్చేసింది. విజయ గర్వంతో బయటకు వచ్చిన కళ్యాణ్‌ను పట్టుకుని కానిస్టేబుల్ లాఠీతో చితగ్గొట్టాడు. ఆ వెంటనే టీవిల్లో తెలుగు ఆత్మగౌరవంపై దాడి జరిగిందని బ్రేకింగ్ న్యూస్‌లు రాసాగాయి. రెండు డజన్ల ఓబి వ్యాన్‌లు సినిమా హాలు వైపు పరుగులు తీశాయి. టీవి కెమెరాలను చూడగానే కళ్యాణ్ ఊగిపోయాడు.
తన చొక్కా , ప్యాంటు విప్పి తెలుగు ఆత్మగౌరవంపై తాకిన దెబ్బలు చూపిస్తున్నాడు. ఒక తెలుగు వాడిగా తెలుగు సినిమా చూడడమే తప్పా! ప్రజాస్వామ్య యుతంగా క్యూలో నిలబడి క్లర్కు గారిని నేను సినిమా చూసేందుకు ఒక టికెట్ ఇవ్వండి అని మర్యాదగా అడుగుతుంటే బుకింగ్ భూ భాగంలోకి కానిస్టేబుల్ చొరబడి ఉర్దూలో తెలుగు పౌరున్ని తిడుతూ కర్నాటక నుంచి తెచ్చిన కర్రతో తయారు చేసిన లాఠీతో చితగ్గొట్టాడు. తెలుగు ఆత్మగౌరవాన్ని నడిరోడ్డున పడేశారు అంటూ ఆవేశంతో ఊగిపోతున్నారు

. మన రాష్ట్రంలో హిందీ సినిమాలు, తమిళ సినిమాలు ఆడుతుంటే మేమెప్పుడైనా హిందీ ఆత్మగౌరవంపైన, తమిళ ఆత్మగౌరవంపైన దాడి చేశామా? మరి తెలుగు ఆత్మగౌరవంపై దాడి చేయడం న్యాయమా? అని అక్కడికి ప్రత్యక్షమైన తెలుగునేత ఆవేదన వ్యక్తం చేశారు. దాడికి నిరసనగా ఆమరణ నిరాహార దీక్ష చేపడుతున్నట్టు ప్రకటించినకళ్యాణ్ బైఠాయించాడు. కాలేజీ వదిలే సమయం కావడంతో దీక్ష విరమించి ఇంటికి బయలు దేరాడు.

డబ్బులు తీసుకుని యూనివర్సిటీలో ఉద్యోగాలు అమ్ముకున్న ఇందిర కుమారి చిద్విలాసంగా కూర్చొంది. నా ఉద్యోగాన్ని ఊడబెరకడం అంటే ఇందిరాగాంధీ మీద కక్ష సాధించడమే! మా నాన్న ఇందిరాగాంధీపై అభిమానంతో నాకా పేరు పెట్టారు.
ఇందిరాగాంధీ, నెహ్రూలపై నేటి పాలకులకు ఉన్న వ్యతిరేకత వల్లనే నన్ను ఉద్యోగం నుంచి తీసేశారు. మీరు నాపై కాదు ఇందిరాగాంధీపై దాడి చేశారు. ఇది ప్రపంచంలోని మొత్తం మహిళలపై జరిగిన దాడి. మహిళల ఆత్మగౌరవంపైన, మహిళల అస్థిత్వంపైన జరిగిన దాడి. ఉద్యోగమే కాదు నా ప్రాణం తీసినా ఇందిర కుటుంబంపై నాకున్న ప్రేమను మరిచిపోయేది లేదు అని ఇందిర కుమారి ఆవేశంగా మాట్లాడడం టీవిలో చూసిన పాలకులకు ఒక్కసారికి వెన్నులో వెణుకు పుట్టింది. అమ్మ కుమారి నీ కెన్ని తెలివి తేటలు అనుకున్నారు.
---------------------
నేటి నీతి: నేరం చేయడం తప్పు కాదు. తప్పించుకునే మార్గాలు తెలియకపోవడం తప్పు.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

మీ అభిప్రాయానికి స్వాగతం