మనం అనుకుంటాం కానీ చెడిపోవడం అంత ఈజీ కాదు. కష్టమైన పని కొద్దిమందే చేయగలరు అందుకే చెడిపోయిన వారెప్పుడూ కొద్దిమందే ఉంటారు. పూర్వజన్మ సుకృతం వల్ల కొంత మంది సునాయాసంగా చెడిపోతారు కానీ అది అందరి వల్ల కాదు చెడిపోవడం అనే లక్షణం నేర్చుకుంటే వచ్చేది కాదేమోనిపిస్తోంది. అందరు చేసేది ఒకే ఉద్యోగం, కొందరు మాత్రమే చేతివాటానికి అలవాటు పడతారు....
చెడులో ఉన్నంత ఆకర్షణ మంచిలో ఉండదు అయితే చెడులో ఉన్నంత కష్టం మంచిలో ఉండదు. ఓసారి ఇదే విషయాన్ని ఓషో రజనీశ్‌చెప్పుకొచ్చాడు. ‘మంచివాడి గురించి చెప్పడానికి ఏ ముంటుంది మంచి వాడు చాలా మంచి వాడు ఇంకా ఇంకా మంచివాడు అంతకు మించి చెప్పలేం కానీ అదే చెడ్డవాడి గురించి చెప్పాలంటే కథలు కథలుగా వర్ణించ వచ్చు. రాముడు మంచి వాడు అనే ఒక్క ముక్కతో మంచితనం ముగిసిపోతుంది. అదే రావణుడి గురించైతే శక్తిసంపన్నుడైన రాక్షసుడు సీతను అపహరించాడు. లంకలో దాచిపెట్టాడు. ఇలా ఎంతైనా చెప్పుకుంటూ పోవచ్చు.
ఎంత కన్నీరు కార్పించే సినిమా అయినా శుభంతో ముగిసినట్టు చివరకు మంచే గెలిచిందని చెప్పుకుంటారు కానీ ఏ సినిమా ఐనా చూడండి చెడు ఎంత ఆకర్షణీయంగా ఉంటుందో. అసలు చెడు లేకపోతే మంచికి విలువే లేదు. విలన్ శక్తిసామర్ధ్యాలపైనే హీరోకు గుర్తింపు ఉంటుంది. లక్ష మంది మంచివాళ్లను తయారు చేయవచ్చు కానీ ఒక చెడ్డవాడిని తయారు చేయడం అంత సులభం కాదు. మన కార్పొరేట్ కాలేజీలు చూడండి ఏటా లక్షలాది మంది విద్యార్థులను బంజరు దొడ్లొ తోలినట్టు తోలేసి పాఠాలు రుబ్బేసీ మంచి వాళ్లుగా మార్కెట్‌లోకి తీసుకు వస్తున్నారు. పార్సల్ చేయడానికి వీలుగా ఉండేందుకు జపాన్‌లో పుచ్చకాయలను ముందు నుంచే చతురస్రాకారంలో పండిస్తారు. పండ్లనే మన ఇష్టం వచ్చిన డిజైన్‌లోకి మార్చుకోగలిగినప్పుడు కార్పొరేట్ కాలేజీలు పిల్లలను ఇష్టం వచ్చిన ఆకారంలోకి మార్చడం పెద్ద కష్టమేమీ కాదు. ఈజీగా కార్పొరేట్ కాలేజీలు లక్షలాది మందిని మంచివాళ్లుగా మార్చేస్తున్నాయి కానీ ఆ కాలంలో ఒక్కడిని చెడ్డవాడిగా మార్చమని మహారాజు అంతటి వాడు వేడుకున్నా రాక్షస గురువులకు సైతం సాధ్యం కాలేదు. అదే నండి హిరణ్యకశిపుని కొడుకు ప్రహ్లాదుడు రాక్షస లక్షణాలు మరిచిపోయి విష్ణు భక్తుడిగా మారిపోతే చిర్రెత్తుకొచ్చిన తండ్రి ఎంత ఖర్చయినా, ఎంత కష్టమైనా సరే మావాడ్ని అర్జంట్‌గా చెడ్డవాడిగా మార్చేయండి అంటూ చండామార్కులకు అప్పగించేస్తాడు. చండామార్కుల వారి వద్ద అసిస్టెంట్ విలన్లలా బోలెడు మంది ఉంటారు. వీరంతా కలిసి నానా తంటాలు పడినా ప్రహ్లాదుడ్ని చెడ్డవాడిగా మార్చలేకపోయారు. నాకు ఎమ్‌సెట్ వద్దు అంటూ కాళ్లు నేలకేసి అరిచి గీ పెట్టినా, కార్పొరేట్ కాలేజీ హాస్టల్‌లో పరేస్తే అవసరం అయితే ఆస్థాన రౌడీలను ఉపయోగించి వాళ్లు వారం రోజుల్లో ఆ కుర్రాడ్ని మంచివాడిగా మార్చేస్తారు. కానీ పాపం చండామార్కుల బృందం ఎంత కష్టపడ్డా ప్రహ్లాదుడిని చెడ్డవాడిగా మార్చలేకపోయారు.
దేవతలను గజగజలాడించిన హిరణ్యకశిపునికి సైతం తన కన్నకొడుకును చెడ్డవాడిగా మార్చడం సాధ్యం కాలేదు. దీన్ని బట్టి అర్ధం కావడం లేదా? చెడ్డవాడు కావడం అంత ఈజీ కాదని. ఎప్పుడైనా హిప్నాటిజం షో చూస్తే, హిప్నటైజ్ కావడానికి సిద్ధంగా ఉన్నవారిని మాత్రమే తాము హిప్నటైజ్ చేయగలమని హిప్నాటిస్ట్‌లు ముందే చెబుతారు. అలానే చెడిపోవాలని ముందు తమకు తాము మనసా వాచా కర్మణ నిర్ణయించుకున్న వారు మాత్రమే చెడిపోగలరు కాని ఎంతటి శిక్ష విధించినా చెడకొట్టడం సాధ్యం కాదని నాటి రాక్షస రాజు హిరణ్యకశిపుడి కొడుకు ప్రహ్లాదుడని నుంచి సచివాలయంలో నేటి క్లర్కు కుటుంబరావు కొడుకు ప్రహ్లాద్ వరకు అందరి విషయంలో రుజువవుతూనే ఉంది. ప్రహ్లాదుని విషయం కొంచం నయం గురువులు తండ్రి మాత్రమే చెడగొట్టడానికి ప్రయత్నించి విఫలమయ్యారు. హరిశ్చంద్రున్ని చెడగొట్టేందుకు మొత్తం దేవతలంతా ఉమ్మడిగా మారి ఎన్ని ప్రయత్నాలు చేశారు? రాజ్యాన్ని, గృహలక్ష్మిని , కొడుకును, అన్నింటిని వదులుకుని కాటకాపరిగా బతికేందుకైనా సిద్ధపడ్డాడు కానీ ఆయన్ని చెడ్డవాడిగా మారలేకదు. నీ కర్మ నీ తలరాత అలా రాసిపెట్టి ఉంటే మేమేం చేయగలమని దేవతలు చేతులెత్తేశారు కానీ హరిశ్చంద్రున్ని చెడ్డవాడిగా మార్చలేకపోయారు. రవి అస్తమించని బ్రిటీష్ వాడినే ఓడించిన మహాత్మాగాంధీ సైతం చిన్నప్పటి నుంచి ఎంత ప్రయత్నించినా చెడ్డవాడిగా మారలేపోయారు.
మహాత్మాగాంధీ ఆత్మకథ చదివితే దేశానికి స్వాతంత్య్రం సాధించడం కన్నా చెడ్డవాడుగా మారడం చాలా కష్టం అని మహాత్ముని జీవితం చెబుతుంది. స్కూల్‌లో కాపీ కొట్టడం వంటి చిన్నపాటి చెడ్డపనే ఆయనకు సాధ్యం కానప్పుడు ఇక పెద్దపెద్ద చెడుపనులు ఆయనవల్లేం అవుతాయి?
మళ్లీ మనం రజనీశ్ వద్దకే వస్తే ఓసారి ఆయన ఉపన్యాసం ముగిసిన తరువాత ఒక వ్యక్తి లేచి మా ఆఫీసులో మిగిలిన వారు లంచాలు తీసుకుని సంతోషంగా ఉంటున్నారు. నేను లంచాలు తీసుకోవడం లేదు , అది నా వల్ల కాదు మరి నేను వారంత సుఖంగా లేను ఇది అన్యాయం కదా! అని ప్రశ్నించాడు. దానికి రజనీశ్ నవ్వి చెడ్డవాడు కావడం అంత సులభం కాదు. లంచం తీసుకునే నీ సహచరులు నిరంతరం పట్టుపడకుండా ఉండేందుకు చురుగ్గా ఉంటారు. నీకా శక్తి లేదు కానీ ఎలాంటి ప్రమాదం లేకుండా వారి మాదిరిగానే పై సంపాదన ఉంటే బాగుండుననే కోరిక నీలో ఉంది. లంచం తీసుకోకుండా ఉండడం నీ బాధ్యత, అంతే తప్ప తీసుకునే వారి కన్నా నేను ఎక్కువ సంతోషంగా ఉండాలని కోరుకోవడం చాలా స్వార్థం. చెడ్డతనం కూడా అంత ఈజీ కాదు అని క్లాస్ తీసుకున్నాడు
. చాలా మంది చెడు వల్ల కలిగే ప్రయోజనాలు ఉండాలని, అదే సమయంలో మంచివాడిగా గుర్తింపు ఉండాలని కోరుకుంటారు, ఇలాంటి వారి కన్నా కల్తీలేని చెడ్డవాడే బెటర్ కదా! చెడ్డవాడు కనిపించినప్పుడు జెలసీ వద్దు, పూర్వజన్మ సుకృతం అనుకుని వదిలేయండి.
nice one.
రిప్లయితొలగించండిBeautiful article.
రిప్లయితొలగించండిmrutyunjaya @ jagadish గారు పోస్ట్ నచ్చినందుకు థాంక్స్ .
రిప్లయితొలగించండిgood one murali garu :-) very nice
రిప్లయితొలగించండిMEERU RAJAKEEYALLOKI RAVALI GURUVU GARU....
రిప్లయితొలగించండిippudu rajakiyallone unnanandi ( naayakudiga kadu)
రిప్లయితొలగించండిచాలా బాగుంది ...చెడు మంచి కలయికే జీవితం ...
రిప్లయితొలగించండిhttp://sairamysr.blogspot.com/