25, ఏప్రిల్ 2011, సోమవారం

‘మా కులం వారికి అధికారం అప్పగించి ఉంటే పరిస్థితి ఇలా ఉండేదా?’

ఛీ చీ... టీవి చూడాలన్నా ,పేపర్ చదవాలన్నా చిరాకేస్తుంది సమాజం ఎటుపోతుందో, రాజకీయాలు ఎంత అధ్వాన్నంగా మారాయో తలుచుకుంటేనే ఒళ్లు మండిపోతోంది - అంటూ రచ్చబండ వద్ద తాను చదువుతున్న పత్రిక నుంచి తలను పైకెత్తి నారాయణ తనలో తానే తిట్టుకున్నాడు. ‘‘ నేను చదువుతున్న పత్రికలోని వార్తలూ చిర్రెస్తున్నాయి ’’ అని విశ్వనాథం గొంతు కలిపాడు.
‘‘నువ్వెన్నయినా చెప్పు విశ్వనాథం మనుషుల్లో స్వార్థం, కులతత్వం మరీ పెరిగింది.



 ప్రజలు కులమతాలకు అతీతంగా ఆలోచించి మా కులం వారికి అధికారం అప్పగించి ఉంటే పరిస్థితి ఇలా ఉండేదా? కులరహిత సమాజ నిర్మాణ సంఘం అధ్యక్ష పదవి మొదలుకుని రాష్ట్ర పాలన వరకు మా కులం వారు పని చేసినంత సమర్ధవంతంగా మరెవరైనా పని చేశారా? నువ్వే చెప్పు . త్యాగాలకు, అభ్యుదయ భావాలకు, కుల రహిత సమాజం ఏర్పాటుకు మా కులం వాళ్లు చేసినంత త్యాగం దేశంలో మరే కులం వాళ్లు చేయలేదని మా కుల సమావేశంలో సైతం నేను చాలెంజ్ చేస్తే ఒక్కరూ నోరుమెదపలేదు’’ అని నారాయణ ఆవేదనగా పలికాడు.
‘‘మా కులం వాళ్లు సర్వం త్యాగం చేసి స్వాతంత్య్రం కోసం పోరాడారు. మా వాళ్లు పోరాడక పోతే దేశం ఇప్పటికీ బానిసత్వంలోనే ఉండిపోయేది. ఐనా ఈ ప్రజలకు ఇంత కూడా కృతజ్ఞత లేదు. ఎవరెవరో అధికారం అనుభవించారు మమ్ముల్ని గుర్తు చేసుకోవడం లేదు’’ అని పక్కనున్న సుబ్బారావు వీరి చర్చలోకి వచ్చాడు.

 ‘‘ ఇప్పుడు మనుషుల్లో కులతత్వం బాగా పెరిగిపోయింది. సమాజం ఇంత అధ్వాన్నంగా మారిపోయినా మా కులం వాళ్లలో మాత్రం అభ్యుదయ భావం వెల్లివిరుస్తోంది. ఏ జన్మలోనో చేసుకున్న పుణ్యం వల్ల మా కులంలో పుట్టాను’’ అని సుబ్బారావు తనకు తాను కితాబు ఇచ్చుకున్నాడు. అప్పటి వరకు వీరి సంభాషణలు వింటున్న ప్రకాశ్‌కు చిర్రెత్తుకొచ్చింది.


 ఆ గ్రామంలో ఇంగ్లీష్ పేపర్ చదివేది ఆయనొక్కరే. గ్రామంలో ఆయన మాట ఎవరూ వినరు, ఆయన ఎవరి మాట వినడు. అదే పనిగా మాట్లాడుతూ పోవడం ఆయన హాబీ. ఈయనతో నష్టం లేదు, లాభం లేదని ఎవరూ ఆయన్ని పట్టించుకోరు. ఆయన , ‘‘డిఫరెంట్‌గా థింక్ చేయాలి ఎప్పుడూ ఒకే మూసలో ఆలోచిస్తారేమిటి?’’ అని అందరినీ నిలదీస్తుంటాడు. బతుకమ్మ పండుగ రోజున టపాకాయలు కాల్చడం, కృష్ణాష్టమికి రంగులు చల్లుకోవడం, దీపావళికి పాలు పొంగించడం భలేగా ఉంటుంది కదూ! ఓ సినిమాలో డిఫరెంట్‌గా థింక్ చేయాలంటూ ఓ పాత్ర ఇలానే చేస్తుంటుంది. సరిగ్గా ఈ పాత్రలానే ప్రకాశ్ ఉంటాడు. తెలుగు చలనచిత్ర సీమను ఒక మలుపు తిప్పేస్తాననే అప్పల్రాజు సినిమా రంగంలోకి వచ్చినట్టుగా, ప్రకాశ్ ప్రపంచ రాజకీయ చరిత్రను తిరగ రాస్తాను - అని గ్రామ రాజకీయాల్లోకి ప్రవేశించారు.


 పంచాయితీలో ఒక వార్డు గెలవడానికి ఒక లక్ష ఖర్చుపెడితే ఆయన మొత్తం గ్రామంలో పది లక్షలు ఖర్చు పెట్టి ఒక్కవార్డులో గెలిచాడు. ఓహో ఎన్నికల సంస్కరణలు అంటే ఇవేనా అని ఆయన ప్రత్యర్థులు ఆయన్ని చూసి ఆశ్చర్యపోతుంటారు. మీరు మరీ సంకుచితత్వంతో మీ మీ కులాల గొప్పతనాన్ని చెప్పుకుంటున్నారు. మా కులం గురించి చెప్పుకోవాలంటే వినడానికి మీకు జీవిత కాలం సరిపోదు కానీ నేను మీలా ఆలోచించే వాడిని కాదు. నిజానికి మన గ్రామస్థులే కాదు మొత్తం మన దేశీయులు అసమర్ధులు, తిండిపోతులు, పనికిరాని చవటలు అంటూ ప్రకాశ్ చెప్పుకుపోతూనే ఉన్నాడు. ఒక్క క్షణం ఆగి ఇంతటి అసమర్ధుల్లో నాలాంటి కొద్దిమంది మేధావులు కూడా లేకపోలేదు.


 మనం మూర్ఖులం అని తెలవడానికి సైతం కొంత తెలివి అవసరం. నేను తెలివైన వాడిని కాబట్టే మన దేశీయులు మూర్ఖులనే విషయం పసిగట్టాను. నేను ఇప్పుడు పసిగట్టిన విషయాన్ని చర్చిల్ కూడా ఒప్పుకున్నాడు. భారతీయులకు తొందరపడి స్వాతంత్య్రం ఇవ్వవద్దు కులం మతం పేరుతో కొట్టుకు చస్తారని అన్నాడు. 60 ఏళ్ల క్రితంకాక, నాలాంటి మేధావి రాజకీయాల్లోకి ప్రవేశించిన ఈ కాలంలో స్వాతంత్య్రం వచ్చి ఉంటే దేశం అద్భుతమైన ప్రగతి పథంలో పయనించేది. కానీ తొందరపడి నేను పుట్టక ముందు స్వాతంత్య్రం లభించడం వల్ల ఇప్పుడు దేశం గడ్డుపరిస్థితిని ఎదుర్కొంటోంది.
 స్వాతంత్య్రం కోసం అనేక వందల ఏళ్లు నిరీక్షించిన భారతీయులు మరో 60 ఏళ్లు ఓపిక పట్టి ఉంటే ఎంత బాగుండేది? భారతీయులు పందికొక్కులని, మహాత్మాగాంధీ హాఫ్‌నేకెడ్ ఫకీర్ అని చర్చిల్ అంటే , తిండిపోతులని జార్జిబుష్ ఆ మధ్యే చక్కని మాట అన్నాడు ’’ అని ప్రకాశ్ చెబుతుంటే దడేల్ మని శబ్దం వినిపించింది. ‘‘నా ఉపన్యాసం నిన్ను అంతగా కదిలిస్తే భుజం తట్టాలి కానీ డిఫరెంట్ అంటూ కొట్టడం నాకేమీ నచ్చలేదు’’, అని కోపంగా వెనక్కి చూశాడు ప్రకాశ్ . అంత గుంపులో ఆ పని చేసింది ఎవఠో గుర్తుపట్టలేదు.
హాయ్ అంటూ దూరం నుంచి ఒక వ్యక్తి చేతులూపాడు. ఎన్నాళ్లకెన్నాళ్లకు అని ఇద్దరు కౌగిలించుకున్నారు. ఈ గ్రామంలో ఉన్నావని తెలిసి వచ్చాను అని ఆగంతకుడు నవ్వుతూ పలికాడు. 



గ్రామస్థులంతా అతన్ని ప్రశ్నార్థకంగా చూస్తుంటే ప్రకాశ్ సంతోషగా ‘‘వీడు నా క్లోజ్ ఫ్రెండ్ ఒకేసారి ఉద్యోగాల్లో చేరాం అచ్చం నాలానే వీడూ డిఫరెంట్‌గా థింక్ చేయాలని చదువుకునేప్పటి నుంచే భావించేవాడు’’ ’ అని పరిచయం చేశాడు. ‘‘నేను డిఫరెంట్‌గా థింక్ చేయడాన్ని అర్థం చేసుకునే తెలివి తేటలు లేని ప్రభుత్వం నన్ను ఉద్యోగంలోంచి తీసేసింది’’ అని ఆగంతకుడు చెప్పుకొచ్చాడు. ‘‘ఉద్యోగాన్ని ఊడబెరికించిన డిఫరెంట్ థింకింగ్ ఏమిటో?’’ అని అప్పారావు ఆసక్తిగా అడిగాడు.‘‘నేను పోలీసు అధికారిని , సాహసం ఎక్కడున్నా అభినందిస్తాను.
 కొత్తగా సెలక్ట్ అయిన పోలీసు అధికారులకు శిక్షణ ఇస్తూ , ‘కసబ్‌లా ధైర్యసాహసాలు అవసరం’అని చెప్పాను. ఒకే ఒక్క వ్యక్తి అంత సాహసంతో మనదేశంపై దాడికి వచ్చాడని మెచ్చుకున్నాను....దీన్ని అర్ధం చేసుకోలేక ప్రభుత్వం నా ఉద్యోగాన్ని ఊడబెరికింది, విలక్షణంగా ఆలోచించే వారికి ఇలాంటి కష్టాలు తప్పవు’’ ’ అని వాపోయాడు ఆగంతకుడు !(భారతీయులను , భారతీయ నాయకులను తిట్టిన చర్చిల్ ను మెచ్చుకున్న ఒక నేతకు అంకితం ) 

5 కామెంట్‌లు:

  1. Good post exposing the double standards & idiotic behavior of the self proclaimed intellectual MLA.

    రిప్లయితొలగించండి
  2. చర్చిల్ ని పొగిడాడా?. వెధవ పనులని సమర్ధించుకోవటం కోసం ఎన్ని వక్రీకరణలు అయిన చెయ్యొచ్చు. వినగలిగితే నిజంగా ఆయన ఏమన్నాడో ఇక్కడ వినొచ్చు.

    http://www.youtube.com/watch?v=37-hOwEUg9s

    రిప్లయితొలగించండి

మీ అభిప్రాయానికి స్వాగతం