13, ఏప్రిల్ 2011, బుధవారం

ఆమె చీర నాచీర కన్నా తెలుపా? అదెలా ? అనే జె లసినుంచి పుట్టిన విశ్వామిత్ర సృష్టి

ఆమె చీర నా చీరకన్నా తెల్లగానా? అదెలా? అనే జెలసీ అన్ని స్థాయిల్లో అందరికీ ఉంటుంది. దాంతో ఆమె కూడా అదే సబ్బుతోనే ఉతుక్కొని తన చీర కూడా ఆమె చీరలానే తెల్లగా చేసుకుని సంతృప్తి పడుతుంది. కానీ కొందరు మాత్రం అంతే తెల్లదనంతో సంతృప్తి చెందరు పోటీగా అంతకు మించిన తెల్లదనాన్ని సృష్టించాలని ప్రయత్నిస్తారు.
 సామాన్యులకు కోపం వస్తే పిల్లల మీదనో, కుక్కపిల్లల మీదనో తీర్చుకుంటారు. మందుతో వచ్చిన ధైర్యంతో కొందరు భార్యల మీద కూడా కోపం తీర్చుకోగలరు. కానీ అసామాన్యులకు కోపం వస్తే సృష్టికి ప్రతి సృష్టి చేసేస్తారు. ఏం బ్రహ్మదేవుడే సృష్టిస్తాడా? ఆ పని నేను చేయలేనా? అనుకున్న విశ్వామిత్రుడు కొత్త స్వర్గానే్న సృష్టించాడు.
 త్రిశంకుడిని స్వర్గానికి పంపాలని ప్రయత్నిస్తే, అక్కడ నో ఎంట్రీ బోర్డు కనిపించడంతో అంతోటి స్వర్గాన్ని నేనూ సృష్టిస్తాననుకున్న విశ్వామిత్రుడు త్రిశంకు స్వర్గాన్ని సృష్టించేశాడు.
విశ్వామిత్రుడికే కాదు విశ్వంలో అందరికీ ఇలాంటి ఆలోచనలే ఉంటాయి. అయితే కొందరు వాటిని సాకారం చేసుకుంటే మరి కొందరు ఆలోచనలతోనే సరిపుచ్చుతారు.

 విశ్వామిత్రుడికే కొత్త స్వర్గాన్ని సృష్టించాలనే ఆలోచన వస్తే అమెరికా అధ్యక్షుడంతటి శక్తివంతుడికి ఎలాంటి ఆలోచన వస్తుంది? ఆయనకొచ్చిన విశ్వామిత్ర సృష్టి ఆలోచనను చంద్రబాబుతో పంచుకున్నారు. అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు క్లింటన్ హైదరాబాద్ వచ్చాడు.
 ఆయనకు వాషింగ్టన్, లండన్‌లను చూసిన అనుభవం ఎలాగూ ఉంది. అన్ని చోట్లా ట్రాఫిక్ జామ్‌లు, రణగోణ ధ్వనులు, నేరాలు, సమస్యలు మామూలుగానే ఉన్నాయి. దీంతో చంద్రబాబు తెలివితేటలకు మురిసిపోయిన క్లింటన్ నువ్వునేను, టోనీబ్లేయర్ కలిసి కొత్త ప్రపంచాన్ని సృష్టిద్దాం అని ప్రపోజల్ పెట్టాడట!వారిద్దరు మాట్లాడుకున్న విషయాలు మీడియాకు ఎలా లీకయ్యాయనే అనుమానం ఎవరికైనా వచ్చిందంటే వారు చంద్రబాబు అధికారం నుంచి దిగిపోయిన తరువాత పుట్టిన వారై ఉంటారు. ఆయన అధికారంలో ఉన్నప్పుడు లీకేజీ జర్నలిజాన్ని కొత్త పుంతలు తొక్కించారు.
 ఆ కాలంలో చంద్రబాబు తన మనసులో తాను మాట్లాడుకున్న విషయాలు కూడా పత్రికల్లో వచ్చేశాయి. లీకేజీ జర్నలిజానికి ఆయన కాలం ఓ స్వర్ణయుగం లాంటిది. కొత్త ప్రపంచం అంటే చంద్రమండలంలోనో మరెక్కడో కానీ వీళ్ల ఆలోచలు ఆచరణలో పెట్టే లోపే అటు క్లింటన్, ఇటు బాబు, మధ్యలో బ్రిటన్ ప్రధాని టోనీ బ్లేయర్ ముగ్గురూ అధికారాన్ని కోల్పోయారు.
వీరిలో ఇద్దరు ఆధికారంపై ఆశను కూడా కోల్పోగా బాబు మాత్రం అధికారంపై ఆశ వదలకుండా మహాపోరాటాలు సాగిస్తూనే ఉన్నారు. టిడిపిలో ఒకరి చేతికింద ఉంటే మన మాట చెల్లుబాటు కాదు మన దేశం మనం సృష్టించేసుకుందామనుకున్న కెసిఆర్ ఏకంగా పార్టీ పెట్టి జై తెలంగాణ నినాదం ఇచ్చేశారు. ఆయన కల సాకారమయ్యే విషయం ఎలా ఉన్నా గద దశాబ్ద కాలం నుంచి అన్ని పార్టీల నాయకులు తమకు ఇష్టం ఉన్నా లేకున్నా ఈ నినాదం చుట్టే తిరుగుతున్నారు.

 రాజకీయాల్లో ఎవరి ఆలోచన రాష్ట్రంలో ఎలాంటి మార్పుకు దోహదం చేస్తుందో కదా! అధిష్ఠానం కరుణించడంతో భవనం వెంకట్రామ్‌ను అదృష్టం వరించింది. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసేప్పుడు తన కాలేజీ మిత్రుడు ఎన్టీఆర్‌ను పిలిచారు. వీరిద్దరు కలిసి చదువుకున్నారు.
 ముఖ్యమంత్రి అంతే ఆషామాషి కాదు ఎలా ఉంటుందో వచ్చి చూడు అన్నట్టుగా భవనం వెంకట్రాం తన కాలేజ్ మేట్‌ను పిలిచాడు. నీవు ఒకందుకు పిలిస్తే నేనొకందుకు వచ్చాను అన్నట్టుగా ఎన్టీఆర్ అచ్చం ఆమె చీర నా చీర కన్నా అంత తెల్లగా ఎలా ఉందబ్బా టైప్‌లోనే ముఖ్యమంత్రి అంటే ఇంత పవర్ ఫుల్‌గా ఉంటుందా? రాజకీయాల్లో ఇంత మజా ఉంటుందా? అనుకున్న ఎన్టీఆర్ చివరకు తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేసి తన మిత్రుడు కూర్చున్న సిఎమ్ పీఠంపై తానూ కూర్చున్నారు. అలా ఇలా కూర్చోలేదు కాంగ్రెస్‌లో అయితే ఏడాది రెండేళ్లకు మించి ఆ కుర్చీలో కూర్చునే వారు కాదు కానీ ఎన్టీఆర్ మాత్రం ఏడేళ్ల కాలం కుర్చీలో కూర్చున్నారు. అయితే పాపం ఆయనకా కుర్చీ కలిసి రాలేదు. తాను నమ్ముకున్న వారే ఆయనకు ఎప్పటికప్పుడు వెన్నుపోట్లతో దించేశారు.
గతంలో, సంఘసంస్కర్త కందుకూరి వీరేశలింగం పంతులుకు ఆంధ్రభాషా సంజీవని పత్రికాధిపతి కొక్కొండ వేంకట రత్నంలకు మధ్య అభిప్రాయ భేదాలు వచ్చాయట. ఆడపిల్లలకు చదువు అవసరం అంటూ కందుకూరి వారు వ్యాసాలు రాసేవారు, కొక్కొండ వారి వాదం ఆడపిల్లలకు చదువు అవసరం లేదు అనేది. దాంతో అప్పటి వరకు కొక్కొండ పత్రికకు వ్యాసాలు రాసిన కందుకూరి వారు అప్పటి నుంచి తానే వివేకవర్థిని అనే పత్రిక ప్రారంభించి తన భావాలు అందులో స్వేచ్ఛగా రాసుకున్నారు. హిందూ పత్రిక స్థాపనలో తెలుగువారున్నప్పటికీ ఆ పత్రిక తమిళులకే ప్రాధాన్యత ఇస్తుండడంతోనే ప్రకాశం పంతులు దానికి పోటీగా ఇంగ్లీష్‌లోనే స్వరాజ్య పత్రికను ప్రారంభించారు. దీనిది ఘనమైన చరిత్రే అయినా ఆర్థికంగా ప్రకాశం పంతులును క్రుంగదీసింది. ఇప్పుడు కొన్ని చానల్స్ పుట్టుక సైతం ఇలా పోటీతోనే. తెలుగుచానల్స్ అన్ని కట్టకట్టుకుని కాం గ్రెస్‌కు వ్యతిరేకంగా, టిడిపికి అనుకూలంగా మహోద్యమాన్ని నడుపుతున్నాయనే అభిప్రాయంతోనే కదా! కాంగ్రెస్ వాదుల చానల్స్ వచ్చాయి. అప్పుడు మీడియాలో టిడిపి ఏకచ్చత్రాధిపత్యం కాగా, ఇప్పుడు టిడిపికి అధికారం లేదు, మద్దతిచ్చే మీడియా సంస్థల సంఖ్య కూడా తగ్గింది.
అప్పుడెప్పుడో దాసరి నారాయణరావుకు ఓ పత్రికాధిపతి తనను పట్టించుకోవడం లేదని కోపమొచ్చి ఒక పత్రికను ఉదయింపజేశారు. ఆ తరువాత ఆ పత్రికా మూతపడింది, కోపం చల్లారింది ఇప్పుడు వారిద్దరూ కబుర్లాడుకోంది ఒక్క రోజు కూడా ఉండలేనంత స్నేహితులయ్యారు. ఆ రెండు పత్రికలు మమ్ములను వ్యతిరేకిస్తున్నాయి వాటికి పోటీగా మాకో రెండు పత్రికలు వచ్చేస్తున్నాయని వైఎస్‌ఆర్ రోజూ చెబుతుండేవారు.....

3 వ్యాఖ్యలు:

  1. కూడలి, హార౦, మాలిక, స౦కలిని లు గుర్తొస్తున్నాయి :)

    ప్రత్యుత్తరంతొలగించు
  2. @harephala గారు థాంక్స్
    @ MAULIకూడలి, హార౦, మాలిక, స౦కలినిల మద్య పోటి ఉంటుందని నేను అనుకోవడం లేదు . ఆరోగ్యకరమైన పోటి ఉంటె బ్లాగ్ లు నిర్వహించే మన లాటి వాళ్ళకే మంచిది కదా

    ప్రత్యుత్తరంతొలగించు

మీ అభిప్రాయానికి స్వాగతం