27, ఏప్రిల్ 2011, బుధవారం

‘అవినీతి అమర్ రహే...

జబ్‌తక్ సూరజ్ చాంద్ రహేగా తబ్‌తక్ భ్రష్టాచార్ రహేగా - సూర్యచంద్రులున్నంత వరకూ అవినీతి అమరమై ఉంటుంది- అంటూ బయట గట్టిగా నినాదాలు వినిపిస్తున్నాయి. ఈ దేశానికి ఏదో చేయాలని దీర్ఘంగా ఆలోచిస్తూ నిద్రలోకి జారుకున్న జర్నలిస్టు జమదగ్ని ఉలిక్కిపడి లేచాడు. ముందు నీ పని నువ్వు సరిగా చేయ్యడం నేర్చుకో..దేశానికి ఏం చేయాలో తర్వాత అని అతన్ని బాస్ నిరుత్సాహ పరుస్తుంటాడు. మేధావిని అర్ధం చేసుకోవాలంటే కొంత మేధావితనం అవసరం అంటూ సిద్ధాంతం గురించి బాస్‌కు బోధించాలనుకున్నా, అభిప్రాయాల కన్నా ఉద్యోగం ముఖ్యం అనే విషయం జమదగ్నికి గుర్తుకొచ్చింది.
 తన లాంటి వాడు జర్నలిస్టు కావడం ఈ పత్రికా ప్రపంచం చేసుకున్న అదృష్టం అని అతని గట్టి నమ్మకం. అవినీతే అభివృద్ధికి మూలం అంటూ అతనో సిద్ధాంత గ్రంథం రాశారు. గైడ్ అవినీతితో మొదలుపెట్టి యూనివర్సిటీనిర్వహణలో సాగుతున్న అవినీతి వరకు, అవినీతి ద్వారా ఎలా అభివృద్ధి సాధించవచ్చునో చక్కగా రాశాడు. అతని తెలివి తేటలకు బెదిరిపోయి నువ్వు మా యూనివర్సిటీ స్థాయి మించి పోయావు అని చెప్పి పంపించేశారు. ఓ డాక్టర్ అవినీతి వల్ల ఓ నర్సింగ్ హోం పుడుతుంది. ఓ నేత అవినీతి వల్ల కార్పొరేట్ కంపెనీ పుడుతుంది. ఓ జర్నలిస్టు అవినీతి వల్ల ఒక మీడియా సంస్థ పుడుతుంది అనేది అతని సిద్ధాంతం. ఆధారాలతో నిరూపిస్తూ సిద్ధాంత గ్రంథం రాశాడు.
ఈ మధ్య దేశంలో అవినీతికి వ్యతిరేకంగా సాగుతున్న పోరు జమదగ్నికి కంటికి కునుకు లేకుండా చేసింది. నిద్రలేని రాత్రులు గడుపుతున్నాడు. జమదగ్ని అవినీతి బయటపడుతుందనే భయంతో నిద్ర లేని రాత్రులు గడిపాడనుకోకండి. అతని జీవితంలో హాయిగా నిద్రపోయిన రాత్రుల కన్నా, ఉద్యోగం పోతుందనే భయంతో గడిపిన నిద్రలేని రాత్రులే ఎక్కువ. జమదగ్నికి అవినీతిలో స్వీయానుభవం ఉంటే సిద్ధాంత గ్రంథం రాసేంత సమయం ఎక్కడుంటుంది?
నంబర్‌వన్ కావడం ఎలా అనే పుస్తకాన్ని అద్భుతంగా రాసేవాడు ఏనాటికీ నంబర్‌వన్ కాడు. ఎలా నటించాలో నేర్పించేవాడు నటుడు కాలేడు. మీరూ నాయకులు కావచ్చు అని చక్కని పుస్తకం రాయగలిగిన వాడు కనీసం తమ కుటుంబ సభ్యులకు కూడా నాయకత్వం వహించలేడు. మరి జమదగ్ని నిద్ర లేని రాత్రులకు కారణం? ఏమిటా? అనే కదా సందేహం.... అవినీతిపై దేశ వ్యాప్తంగా ఉధృతంగా సాగిన ఆందోళన అతన్ని అయోమయంలో పడేసింది. దేశంలో నోరున్నవారు నోటితో, మూగవారు రాతలతో అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమించేస్తున్నారు. దీంతో అవినీతి నిలిచిపోతే ఈ దేశ అభివృద్ధి ఏం కావాలి? అనే భయం జమదగ్నిని వెంటాడుతోంది. దేశ ప్రజలంతా అవినీతిని వ్యతిరేకిస్తుంటే మరి ఈ దేశంలో లంచాలు ఇస్తున్నది, తీసుకుంటున్నది పాకిస్తాన్ ఐఎస్‌ఐ ఏజెంట్లా? అనే భయం మరోవైపు అతన్ని పీడించడంతో తనికి నిద్రే కరువైంది. 

మన నాయకులకు ప్రత్యర్థి పార్టీ నాయకుల అవినీతి కలవరం కలిగిస్తే జమదగ్నికి అవినీతి కనిపించకుండా పోతుందేమోననే భయం పట్టుకుంది. అన్నా హజారే చుట్టూ చీమల దండులా చేరిన జన ప్రవాహం రోజు రోజుకు పెరుగుతుంటే జమదగ్ని బిపి అదే స్థాయిలో పెరగసాగింది. ఎంతో జీవితానుభవనం ఉన్న జమదగ్ని తాత - అరే జమా! నువ్వు అనవసరంగా భయపడుతున్నావురా! ఏమీ కాదు నా మాట నమ్ము- అని అనునయించాడు. ‘‘ఇప్పుడు అన్నాహజారేకు జయ్ కొడుతున్న వీళ్లే ప్రభుత్వ కార్యాలయాల్లో ఏదైనా పని పడితే ముందు లంచం ఇచ్చి తరువాత తమ పనేంటో చెబుతారు. 


మొన్న రిజిస్ట్రేషన్ ఆఫీసులో పదివేలకు పైసా తగ్గేది లేదని డిమాండ్ చేశాడు చూడు బట్టతల పొట్టోడు వాడు హజారే దీక్ష మద్దతు శిబిరంలో ముందు వరుసలో కూర్చోని టీవిల ముందు అవినీతికి వ్యతిరేకంగా ఎంత చక్కగా మాట్లాడాడు. వాడి నటనకు ముచ్చటేసింది. ఆ పొట్టోడు అవినీతి నిర్మూలన జరగాలని కోరుకుంటున్నాడంటే నువ్వు నమ్ముతావా? అవినీతి అంతమై పోతుందేమో దాంతో అభివృద్ధి నిలిచిపోతుందేమోనని నువ్వు అనవసరంగా భయపడుతున్నావు. దుస్తుల ఫ్యాషన్‌కు ఫ్యారిస్ కేంద్రమైతే సిద్ధాంతాల ఫ్యాషన్‌కు మన దేశం పుట్టిల్లు. ఒకప్పుడు ఖద్దరు ఫ్యాషన్, యువత కొంత కాలం ఎర్ర పార్టీల ఫ్యాషన్‌లో తడిసి ముద్దయ్యారు. . తరువాత అన్నల ఫ్యాషనొచ్చింది. మొన్న భక్తి ఫ్యాషన్ దేశాన్ని ఊపేసింది. ఇప్పుడు అవినీతి వ్యతిరేకత అనేదో ఫ్యాషన్. లంచం ఇచ్చేవారు, పుచ్చుకునే వారు ఇద్దరూ పోటీ పడి ఈ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషిస్తున్నారు. ఈ ఉద్యమం ఎంత ఉధృతంగా వచ్చిందో అంతే వేగంగా చల్లబడిపోతుంది నా మాట నమ్ము’’, అని జమదగ్నితాత నచ్చచెప్పాడు.


 జన్‌లోక్‌పాల్ డ్రాఫ్ట్ కమిటీ సభ్యులు శాంతిభూషణ్ వ్యవహారాలపై తొలుత టేపులు బయటపడ్డాయి. తరువాత భూమి వ్యవహారం బయటపడింది. చివరకు ఉద్యమ కర్త అన్నాహజారే తన పుట్టిన రోజు వేడుకలకు ట్రస్ట్ డబ్బులు రెండు లక్షలు ఖర్చు చేశాడనే కేసులో కోర్టుకు హాజరయ్యారు. శాంతిభూషన్ టేపుల వ్యవహారంతో కమిటీ నుంచి తాను తప్పుకుంటున్నట్టు కర్నాటక లోకాయుక్త హెగ్డే ప్రకటించారు. హెగ్డే చరిత్ర కూడా తక్కువేమీ కాదని మరొకాయన ఆరోపించాడు. ఇవన్నీ వరుసగా ఒకదాని తరువాత ఒకటి జరగడం చూశాక జమదగ్నిలో ధైర్యం పెరిగింది. వందకోట్ల  మంది భారతీయుల్లో ఒలింపిక్ గోల్డ్ మెడల్ సాధించడానికి ఒక్క భారతీయుడు లేడా? అని గతంలో ఆవేదన చెందేవారు.
 ఒలంపిక్ గోల్డ్‌మెడల్ సంగతి పక్కన పెట్టి జన్‌లోక్‌పాల్ బిల్లు కోసం 120 కోట్ల మంది భారతీయుల్లో అవినీతి చరిత్రలేని ఐదుగురు దొరకరా? అని ఇప్పుడు అనుకోవలసొస్తోంది. మొత్తం పది మంది సభ్యుల్లో ఐదుగురు మంత్రుల అవినీతిపై ఎవరికీ సందేహం లేదు. పౌర సమాజం నుంచి ఐదుగురు సభ్యులను ఎంపిక చేస్తే ఇప్పటి వరకు వారిలో ముగ్గురిపై  ‘అవినీతి అమర్ రహే...ఆరోపణలు వచ్చాయనే విషయం తెలిశాక జమదగ్ని హాయిగా నిద్రపోయాడు. జబ్‌తక్ సూరజ్ చాంద్ రహేగా తబ్‌తక్ భ్రష్టాచార్ రహేగా’ అని జమదగ్ని కూడా గట్టిగా నినాదాలు చేశాడు.
అక్షరసత్యం: మానవ జాతి ఉన్నంతవరకు అవినీతి ఉంటుంది. అవినీతి శాశ్వతం, ఉద్యమాలు అశాశ్వతం!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయానికి స్వాగతం