21, ఏప్రిల్ 2011, గురువారం

నాటకాంధ్ర ప్రదేశ్ ...... సరదా కబుర్లు

ఏవండోయ్ సాయంత్రం తొందరగా రండి రవీంద్రభారతిలో నాటక ప్రదర్శనకు వెళదాం. పిల్లలూ ముచ్చటపడుతున్నారు- అంటూ తాయారు పలికింది. నాకు కుదరదోయ్ అని నీలకంఠం సింపుల్‌గా చెప్పేశాడు. అజాత శత్రువే అలిగిన నాడు - అంటూ తాయారు పద్యం అందుకుని అటు సూర్యుడు ఇటు పొడిచినా మనం నాటకానికి వెళుతున్నాం వెళ్లి తీరాల్సిందే అని హుకూం జారీ చేసింది. మన పక్కనున్న తమిళనాడు, కర్నాటకల్లో ఇప్పటికీ నాటకాలు సజీవంగా ఉన్నాయి. టికెట్లు కొని నాటకాలు చూస్తారు. అదేం దరిద్రమో కానీ తెలుగునాట నాటకాలంటేనే తెలియకుండా పోయింది. అప్పుడెప్పుడో 60-70 ఏళ్ల క్రితం నాటి నాటకాల గురించే ఇప్పుడు కూడా గొప్పంగా చెప్పుకోవడం తప్ప మనకు నాటకాలు ఎక్కడ ఏడిచాయి అని తాయారు కాస్త ఆవేదనగానే పలికింది.పిచ్చి తాయారు నీ అమాయకత్వం కాకపోతే తెలుగునాట నాటక కళ చచ్చిపోవడం ఏమిటి? మన జీవితాల్లో కలిసిపోయింది. తమిళనాడులో, కర్నాటకలో మహా అయితే రెండు మూడు డజన్ల థియోటర్లలో నాటకాలు వేస్తే, రోజుకో వెయ్యి మంది నాటకాలు చూస్తూ ఉండొచ్చు, అంతేనా? అని నీలకంఠం కాస్సేపు ఆగి, కాలంతో పాటు నాటకాల రూపూ మారిపోయింది. ఆ విషయం నీకు తెలియక నాటకాలు లేవనుకుంటున్నావు.

తెలుగునాట సాంప్రదాయకంగా నాటకాల ప్రదర్శలు లేవు అను ఒప్పుకుంటాను. నాలుగు గోడలు, డజను మంది నటులు, ఐదు వందల మంది ప్రేక్షకులు నాటకం అంటే ఇదే అనుకుంటున్నావేమో తెలుగు నాట నాటకానికి నిర్వచనమే మారిపోయింది. గతంలో  రాష్ట్రం పేరును స్వర్ణాంధ్రగా ప్రచారం చేశారు. అధికారంలోకి వచ్చిన వైఎస్‌ఆర్ గారు స్వర్ణాంధ్ర పేరును మూలన పడేసి హరితాంధ్ర అన్నారు. నిజానికి మన రాష్ట్రానికి ఈ పేర్లేమి సరిపోవు. నాటకాంధ్ర ప్రదేశ్ మన రాష్ట్రానికి బాగా సరిపోయే పేరు ఏమంటావు అని నీలకంఠం భార్యను అడిగాడు.


ఆమె ప్రశ్నార్థకం ముఖం పెట్టడంతో రాష్ట్రంలో ఎవరైనా సహజంగా కనిపిస్తున్నారా? నాయకులు, మేధావులు, మీడియా అంతా తమ తమ పాత్రల్లో జీవించేస్తున్నారు ఇలాంటి రాష్ట్రాన్ని నాటకాంధ్ర ప్రదేశ్ అనకుండా ఇంకేమంటాం. బాబు గారు పరిపాలనను వీధినాటకంగా మార్చేస్తే రోశయ్య ,కిరణ్ జమానా వచ్చేసరికి జన జీవితమే నాటకంగా మారిపోయింది. ఒకరిని మించి ఒకరు నటించేస్తున్నారు. గవర్నర్ తన పాత్ర పరిధి దాటి నటించేస్తున్నారనేది మిగిలిన వారి విమర్శ. ఇక తనది దారిన పోయే దానయ్య పాత్ర - అని స్వయంగా రోశయ్య ప్రకటించా రు  .  ఇక కిరణ్ కుమార్ కు తనపాత్ర   ఏమిటో తనకే అర్ధం కాకుండా నటించేస్తున్నాడు. ఇంతకు మించిన నటన ఏ ముంటుంది. నాలుగు దశాబ్దాలుగా హైదరాబాద్‌లో ఉంటున్నాను మీరు పొమ్మన్నా పోను నేను సమైక్యవాదిని కాదు వీర తెలంగాణ వాదిని అనే అభిప్రాయం కలిగించే విధంగా తెలంగాణ వాదుల ముందు, తెలంగాణ మంత్రులు వద్దన్నా పరీక్షలు నిర్వహించాను చూడండి అంటూ వీర సమైక్య వాదిగాసీమాంధ్ర నాయకుల ముందు రోశయ్య నటన సామాన్యమైనదా? టెలిఫోన్లు వచ్చిన కొత్తలో పక్కన ఫోన్ పెట్టుకుని గదవ మీద చేయి పెట్టుకుని ఫోటోలు దిగడం ఫ్యాషన్‌గా ఉండేది. ముఖ్యమంత్రి అయిన కొత్తలో అచ్చం అలానే కంప్యూటర్ ముందు వౌస్ పట్టుకుని ఉన్న బాబుగారి ఫోటోల ప్రకటనలు పత్రికల్లో నిండిపోయేవి. అప్పుడు కంప్యూటర్ ముందు తెగనటించేసిన బాబు హఠాత్తుగా రైతుపాత్రలో జీవించేశారు. రాముడిగా జనాన్ని రంజింపజేసిన ఎన్టీఆర్, రావణాసురిడిగా నటించలేదా? జనం విరగబడి చూడలేదా? నటుడు అన్నాక ఒకే పాత్రకు ఎలా పరిమితం అవుతారు, ఏ పాత్రలోనైనా పాలలో నీళ్లలా కలిసిపోవాలి కదా! ఈ విషయం తెలియక బాబు కొత్త పాత్ర మీద చాలా మంది విమర్శలు చేశారు. బాబు మాత్రం ఏ పాత్రలోనైనా ఇట్టే లీనమవుతున్నానని అనుకుంటున్నారు. అందుకే ఆయన అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడిన దానికి ఏ మాత్రం సంబంధం లేకుండా ఇప్పుడు మాట్లాడేస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఏదీ ఉచితంగా రాదు అని సెలవిచ్చిన బాబు ఇప్పుడు విద్యార్థులందరికీ ఉచితంగా చదువు చెప్పించక పోతే తాట ఒలిచేస్తానంటూ చక్కని డైలాగులు చెబుతున్నారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇస్తే కరెంట్ తీగలు బట్టలారేయడానికే పనికి వస్తాయనే పాపులర్ డైలాగును చక్కగా చెప్పిన ఆయన ఇప్పుడు అన్నీ ఉచితంగా ఇచ్చి తీరాల్సిందే దాని కోసం ఉద్యమిస్తామనే డైలాగు అంత కన్నా బలంగా చెబుతున్నారు.


వీళ్లిద్దరేనా పూవు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్టు కళాకారులు ఇంట పుట్టిన బిడ్డ కచ్చితంగా కళాకారుడు అయి తీరుతాడు అన్నట్టు తండ్రి డైలాగులను అచ్చం తండ్రి లానే చెబుతూ జగన్ ఎంత బాగా నటిస్తున్నాడు. ఓటర్లంతా తన కుటుంబమేనని, తనకు తండ్రి ఇంత పెద్ద కుటుంబం అప్పగించాడని చక్కని డైలాగులు చెబుతూ పాత్రలో జీవించేస్తున్నాడు. నటన విషయం ఎలా ఉన్నా డైలాగుల విషయంలో మాత్రం కెసిఆర్‌ దూసుకెలుతున్నరు  .
 వీళ్లేనా టీవిల్లో చర్చలు చూడు.... అడిగే వారు, చెప్పేవారు ఎంత బాగా నటిస్తారో? వెర్రి చర్చ అని చర్చ జరిపే వాడికి, మాట్లాడే వాడికి, వినేవాడికి తెలుసు. మళ్లీ అంతా నటించేస్తుంటారు. మన చుట్టే నాటకాలు సాగుతుంటే రాష్ట్రంలో నాటక కళ అంతరించిపోయిందనడం భావ్యమా తాయారు ’’ అని నీలకంఠం ప్రశ్నించాడు. మీ మాటలు చూస్తుంటే నాటకానికి తీసుకు వెళ్లకుండా ఉండేందుకు మీరు నటిస్తున్నారేమోననిపిస్తోందండి అని తాయారు మెల్లగా పలికింది. 

5 వ్యాఖ్యలు:

 1. మురళి గారు,
  మీ వ్యాసలను పేపర్లో చదివేవాడిని. బ్లాగులో మీరు రోజుకొక టపా రాయటం చాలా బాగుంది. బ్లాగు రాయటం కాకుండా మీరేమైనా పుస్తకాలు రాస్తారా? రాస్తే అందులో ఎటువంటి అంశాల పైన రాస్తారు.

  ప్రత్యుత్తరంతొలగించు
 2. rama గారు నా వ్యాసం నచ్చినందుకు థాంక్స్ . రాజకీయ అంశాలపై జనాంతికం పేరుతో గతం లో ఒక పుస్తకం ప్రచురించాను. వ్యక్తిత్వ వికాసం గురించి ఎక్కువగా పుస్తకాలు ఇంగ్లిష్ నుంచి వస్తున్నాయి. అలా కాకుండా రామాయణం, భారతం వంటి పురాణాల నుంచి ఉదాహరణలు తీసుకోని ఓటమే గురువు పేరుతో ఐదేళ్ళ క్రితం బుక్ రాశాను . మార్కెట్ లో బాగానే అముఉడు పోయాయి . ఇప్పుడు దొరకవు. ఆ బుక్ మళ్లీ ప్రింట్ చేయల లేక పిడిఎఫ్ చేసి రోజు పోస్ట్ చేయల అని ఆలోచిస్తున్న. ఓటమే గురువు బుక్ పై పత్రికల్లో మంచి రివ్యూలు వచ్చాయి. మూడు వాటిని పోస్ట్ చేసి తరువాత నిర్ణయం తీసుకుంటా. నా బుక్స్ గురించి మీ కామెంట్ వల్ల ప్రస్తావించే అవకాశం వచ్చింది.

  ప్రత్యుత్తరంతొలగించు
 3. అయ్యా మురళి గారు మీరు ఈ రోజు రాసిన టపాకి కామేంట్ సెక్షన్ తీసేశారు. కనుక ఇక్కడ రాస్తున్నాను. అదేమిటండి నకిళీ కణికుడి నాయకుడిని మీరు ప్రభుత్వాసుపత్రిలో పుట్టారని రాస్తున్నారు. వారికి పుట్టుకా,మరణం లాంటివి ఉండవు. వారు పేపర్ లో అబ్బద్దాలు, అసత్యాలను అతిచక్కగా వ్యవస్థీకృతం చేసి డబ్బు ఎలా సంపాదించాలో అని చూపించారు. కనుక తెలుగు నాట పేపర్, మీడియా ఉన్నంత వరకు అసత్యాలు,అబ్బద్దాలు ఉంట్టాయి కనుక వారు వార్తల వెనుక దాగుకొని జీవిస్తుంటారు.

  ప్రత్యుత్తరంతొలగించు
 4. అజ్ఞాత గారు క్షమించాలి . కామెంట్ సెక్షన్ తిసివేయలేదు . పోస్ట్ చేసేప్పుడు అలా వస్తోంది. ప్రతి పోస్ట్కు అలా వస్తే నేను మళ్లీ సరిచేసుకున్తున్నాను. ఈ పోస్ట్ విషయం లో చూసుకోలేదు .మీ కామెంట్ చూశాక సారి చేశాను. గమనించగలరు

  ప్రత్యుత్తరంతొలగించు

మీ అభిప్రాయానికి స్వాగతం