నిన్ను చూసి ఓకే అన్నాక తెలిసింది నా అంత బుద్ధి తక్కువ వాడు ఉండడని’’ అంటూ శ్రీకాంత్ అలా మాట్లాడుతూనే పోతున్నాడు. ‘‘ఇప్పటి వరకు మీరు మాట్లాడిన దాంట్లో మీ అంత బుద్ధి తక్కువ వాడు లేడనే మాట మాత్రం సత్యమండి ’’ అంటూ భార్యామణి విశాలాక్షి సెలవిచ్చింది. ‘‘ మీరెంత తెలివి తక్కువ వారో మన పెళ్లయిన తరువాత తెలిసింది.
ఆ విషయం ముందే తెలిసుంటే - నేనంటే పడి చచ్చే మా క్లాస్‌మెట్ మన్మధరావును చేసుకుని ఉండేదాన్ని .... అదే నండి మొన్న సినిమా హాల్లో కలిశాడు ... లేత ముదురు రంగు చర్మాస్ షర్ట్ వేసుకున్నాడు అతనే’’ అంటూ విశాలాక్షి వివరించింది.
‘‘మరీ అంత తమ్మయంతో గుర్తు చేయాల్సిన అవసరమేమీ లేదు.,. .. నా తెల్ల రంగు షర్ట్ నీ ఉతుకుడు వల్ల గోదుమ రంగులోకి మారిందన్నా నీకు గుర్తుండదు కానీ వాడెవడో వేసుకున్న షర్ట్ రంగు కూడా గుర్తుందన్నమాట! ’’ అంటూ శ్రీకాంత్ కసిగా చెబుతూ, ‘‘ అయినా భగవంతుడు నా జీవితాన్ని ఇలా రాసిపెడితే ఎవరైం చేస్తారు... మొన్న బస్టాండ్‌లో బస్సుకోసం ఎదురు చూస్తుంటే రయ్ మంటూ కారొచ్చి ఆగింది. అచ్చం హీరోయిన్లా ఉన్నావిడ కారులోంచి దిగి వయ్యారంగా నా వైపు నడుచుకుంటూ వచ్చింది’’ అని శ్రీకాంత్ ఒక్క క్షణం ఆగాడు.
‘‘ ఏంటీ సినిమా కథ చెబుతున్నారా? లేక ఆఫీసులో పనీపాటా లేక నిద్రపోయి కన్న పగటి కలలు చెబుతున్నారా? ’’ అని శ్రీమతి దెప్పి పొడిచింది. ‘‘పగటి కలైతే నీకెందుకు చెబుతాను. ఆ క్షణంలో నాకూ అలాంటి అనుమానమే వచ్చింది అంత అందగత్తె నా వైపు రావడం చూశాక. నిజంగా జరిగింది కాబట్టే చెబుతున్నాను. నా వైపు నడుచుకుంటూ వచ్చి మిస్టర్ శ్రీకాంత్ అంటూ దగ్గరికొచ్చింది.
ఆ మాటతో గాల్లో తేలిపోయాను’’ అని శ్రీకాంత్ తన్మయంగా చెప్పాడు. ‘‘ చూస్తే తెలుస్తూనే ఉంది లేండి... తరువాతేం జరిగిందో చెప్పండి ముందు’’ అని విశాలాక్షి అడిగింది. ‘‘ ఔను మేడం నేను శ్రీకాంత్‌ను ’’ అంటూ ప్రశ్నార్ధకంగా చూశాను. ‘‘ ఆ సుందరాంగి చిన్నగా నవ్వి నేను మీకు గుర్తుకు వచ్చే అవకాశం లేదు లేండి... గాంధీనగర్ రెండో వీధిలో మీరు నన్ను చూశారు. గుర్తుకు రాలేదా?
నన్ను మీరు పెళ్లి చూపుల్లో చూశారు. మొదటి సారి పెళ్లి చూపులు కావడంతో బెరుగ్గా భయం... భయంగా కూర్చున్నాను. మీరు నన్ను రిజెక్ట్ చేశారు.
ఆ రోజంతా నిద్ర పట్టలేదనుకోండి నాలో నేనే కుమిలి కుమిలి ఏడ్చాను. ఆ భగవంతున్ని తిట్టుకున్నాను. కానీ భగవంతుడు ఎప్పుడూ మేలే చేస్తాడు. మా ఆయన మల్టీనేషన్ కంపెనీలో జనరల్ మేనేజర్... పండక్కి సరదాగా బంగారు నగలు కొందామని వచ్చాను. బస్టాప్ వైపు చూస్తే మీరు కనిపించారు.
జీవితంలో మనకు సహాయం చేసిన వారిని ఎప్పుడూ మరిచిపోవద్దని అమ్మ చెప్పింది మీరు కనిపించగానే థ్యాంక్స్ చెబుదామని వచ్చాను’’ అంటూ ఎంత వేగంగా వచ్చిందో అంతే వేగంగా వెళ్లిపోయింది. కనీసం ఫోన్ నంబరైనా తీసుకోలేదు. ఇంత కాలమైనా నేను చేసిన సహాయం మరిచిపోకుండా కృతజ్ఞతలు చెప్పింది. సంస్కారం అంటే అదీ! నువ్వెప్పుడైనా అలా చెప్పావా?’’ అని శ్రీకాంత్ ప్రశ్నించాడు.
‘‘ఇంతకూ తమరు ఆవిడకు చేసిన సహాయం ఏమిటో?’’ అని శ్రీమతి అడిగింది.‘‘ అయ్యో హడావుడిలో ఆ విషయం అడగడమే మరిచిపోయాను’’ అని శ్రీకాంత్ బాధపడ్డాడు. ‘‘వెర్రిమొగుడా! పెళ్లి చూపుల్లో నీవు ఓకే అని ఉంటే నీతో ముష్టిబతుకు బతకాల్సి వచ్చేది... ఇలా బస్సుల కోసం నిరీక్షించడానికే జీవితం సరిపోయేది.... నీవు కాదనడం వల్ల నా జీవితం బాగుపడింది... జనరల్ మేనేజర్‌ను చేసుకోవడం వల్ల హాయిగా కారులో తిరుగుతున్నాను అని చెప్పకనే చెప్పింది’’ అంటూ భార్యామణి దెప్పి పొడిచింది.
అదేం కాదు, ఏమో సహాయం చేసే ఉంటాను అని శ్రీకాంత్ పైకి చెప్పినా మనసులో మాత్రం అదే నిజమేమో! ఆ క్షణంలో నాకీ విషయం గుర్తుకు రాలేదేమబ్బా! -అనుకున్నాడు. నీవేమన్నా అనుకోవోయ్ మీనాక్షిని చేసుకుని ఉంటే నా జీవితం వేరుగా ఉండేది అని శ్రీకాంత్ నిట్టూర్చాడు. మీ జీవితం ఏమో కానీ ఆమె జీవితం మాత్రం కచ్చితంగా నా అంత దరిద్రంగానే ఉండేదండి అని భార్య సమాధానం చెప్పింది.
‘‘కొన్ని కొన్ని విషయాలు అలానే అనిపిస్తాయోయ్! చిన్న చిన్న విషయాలే చరిత్ర గతిని మార్చేస్తాయి. అంతెందుకు వైఎస్ఆర్ ఉండి ఉంటే కెసిఆర్ తెలంగాణ అడిగి ఉండేవాడా? కెసిఆర్‌కు బాబు మంత్రి పదవి ఇచ్చి ఉంటే టిఆర్ఎస్ను ఏర్పాటు చేసి ఉండేవాడా? ఇప్పుడీ సమస్య వచ్చి ఉండేదా?’’ అని శ్రీకాంత్ తన రాజకీయ పరిజ్ఞానాన్ని బహిర్గతం చేశాడు. ‘‘మీ వైఎస్ఆర్ ఉన్నప్పుడే కదండి యుపిఎ కామన్ మినిమమ్ ప్రొగ్రామ్‌లో తెలంగాణాను చేర్చింది. కరీంనగర్లో రెండులక్ష మెజారిటీతో కెసిఆర్ గెలించింది అప్పుడే కదా! వైఎస్ఆర్ ఉండి ఉంటే అడ్డంకులేమీ లేకుండా తెలంగాణ ఇచ్చేసేవారేమో! నా కోడి కూయకపోతే ఊళ్లో తెల్లవారదనుకున్న ముసలావిడలా ఉందండి మీ వ్యవహారం. కెసిఆర్ కాకపోతే మరో నాయకుడు తెలంగాణ కోసం ఉద్యమించేవాడు’’ అని శ్రీమతి తేలిగ్గా చెప్పేసింది.
‘‘నేనేం చెప్పినా ఖండించడమే లక్ష్యంగా పెట్టుకున్నావా? సరేలే మీ అన్న ఎన్టీఆర్ ఉండి ఉంటే ఇలా జరిగేది కాదంటాను దానికి ఒప్పుకుంటావా? ’’ అని శ్రీకాంత్ వెటకారంగా ప్రశ్నించాడు.
మహాత్మాగాంధీ వల్ల దేశానికి స్వాతంత్య్రం వచ్చిందని నేనంటే మన పక్కింటి పార్వతి స్వాతంత్య్ర పోరాటం సాగే కాలంలో ఎన్టీఆర్ సినిమాల్లో బిజీగా ఉన్నారు కానీ లేకపోతేనే ఎన్టీఆర్ వల్లనే స్వాతంత్య్రం వచ్చే ఉండేదని గట్టిగా వాదించింది. అయినా ఏది జరగాలని రాసి ఉంటే అలా జరుగుతుంది అలా అయితే ఇలా అయ్యేది..
ఇలా అయితే అలా అయి ఉండేదనే గొడవ మనకెందుకు లేండి అంటూ శ్రీమతి వంట గదిలోకి వెళ్లింది. **
superb
రిప్లయితొలగించండితెలుగు కళ గారికి తెలుగు లోనే కృతజ్నతలు
రిప్లయితొలగించండిబావుంది. ఎలా నేనీ టపా మిస్సయ్యానో. అసలు Snkr లేకపోతే నేనీ టపాయే చూసేవాణ్ణికానేమో!! :)
రిప్లయితొలగించండి