19, ఏప్రిల్ 2011, మంగళవారం

విగ్రహాల వెనుక నక్కిన వికృత రాజకీయాలు: విగ్రహాల ఏర్పాటుకు మార్గదర్శకాలు


రాష్ట్రం లో విగ్రహ రాజకీయాలు జోరుగా సాగుతున్నాయి . ఏ అంశం పై నైన ఆరోగ్య కరమైన చర్చ జరగాలి . ట్యాంక్ బండ్ పై విగ్రహాల కుల్చివేతకన్న ముందుగా టిడిపి జగన్ ల మద్య విగ్రహలపై సాగిన రాజకీయం పై గత యాడాది  అక్టోబర్ లో ఒక వ్యాసం ఆంద్రభూమిలో రాసాను . ఇప్పుడు విగ్రహలపై ప్రభుత్వం క్యాబినెట్ సబ్ కమిటి వేసినందున ఆసక్తిగా ఉంటుందని అప్పటి వ్యాసం జత చేస్తున్న . విమర్శలు మర్యాదకరమైన భాషలోనే ఉంటె బాగుంటుంది


 విగ్రహాల ఏర్పాటుకు మార్గదర్శకాలు


 రాష్ట్రంలో సామాజిక, రాజకీయ ప్రముఖుల విగ్రహాల ఏర్పాటుకు మార్గదర్శక సూత్రాలను ఖరారు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. విధి విధానాల రూపకల్పన నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం ఐదుగురు మంత్రులతో కూడిన మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేసింది. ఈ ఉప సంఘం చైర్మన్‌గా పర్యాటక శాఖ మంత్రి వట్టి వసంతకుమార్‌ను నియమించారు. ఈ మేరకు రాష్ట్రప్రభుత్వం జీవో ఆర్‌టి నెంబర్ 1607ను జారీ చేసింది. ఈ సంఘంలో మున్సిపల్ శాఖ మంత్రి మహీధర రెడ్డి, పంచాయితీ రాజ్ శాఖ మంత్రి జానారెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి రఘువీరారెడ్డి, రోడ్లు భవనాల శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఉన్నారు. సాంస్కృతిక, పర్యాటక మంత్రిత్వ శాఖ ముఖ్య కార్యదర్శి కమిటీకి కన్వీనర్‌గా ఉంటారు. మంత్రివర్గ ఉపసంఘం మార్గదర్శక సూత్రాలను రూపొందించి ప్రభుత్వానికి నివేదికను సమర్పిస్తుంది.విగ్రహాల వెనుక నక్కిన వికృత రాజకీయాలు

- బుద్దా మురళి

రాష్ట్రంలో ప్రధాన రాజకీయ పక్షాల మధ్య అధికారం కోసం సాగుతున్న పోరులో భాగంగా విగ్రహాల ఏర్పాటు పోటీ సాగుతోంది. వర్షాకాలంలో పొలాల్లో విత్తనాలు నాటినంత ఉధృతంగా ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కడపడితే అక్కడ విగ్రహాలను ఏర్పాటు సాగుతోంది. ముఖ్య నాయకులు ఒకవైపు తమ నాయకుల విగ్రహాలను ఆవిష్కరిస్తూ పనిలో పనిగా తమ ప్రత్యర్థి పార్టీకి చెందిన నాయకుని విగ్రహాలను ఏర్పాటు చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వారం క్రితం (సెప్టెంబర్ 26) రాష్ట్రంలో మూడు ప్రాంతాల్లో ముగ్గురు మహనీయుల విగ్రహాలను ఒకే రోజు ఏర్పాటు చేశారు. అనంతపురం జిల్లా హిందుపూర్‌లో చంద్రబాబు ఎన్టీఆర్ విగ్రహాన్ని, ప్రకాశం జిల్లాలో వైఎస్‌ఆర్ విగ్రహాన్ని జగన్మోహన్‌రెడ్డి, గుంటూరులో మహానటుడు ఎస్‌వి రంగారావు విగ్రహాన్ని చిరంజీవి సోదరుడు నాగబాబు ఆవిష్కరించారు. ఎస్వీఆర్, ఎన్టీఆర్, వైఎస్‌ఆర్ వారి వారి రంగాల్లో నిస్సందేహంగా గొప్పవారు. జనంలో పూజలందుకున్న మహానటులు ఎన్టీఆర్, ఎస్వీఆర్‌లు, ఈ తరంలో కూడా రాజకీయ నాయకులకు జనంలో గ్లామర్ ఉంటుందని నిరూపించిన గొప్ప నాయకుడు వైఎస్‌ఆర్. ఈ ముగ్గురి గొప్పతనాన్ని ప్రశ్నించాల్సిన అవసరం లేదు. కానీ ఆ ముగ్గురి విగ్రహాలను ఒకే రోజు ఆవిష్కరించింది వారి వారి సామాజిక వర్గాలకు చెందిన వారే. ఇది యాదృచ్చికంగా జరిగిందా? అదే నిజమైతే సంతోషమే. కానీ మొన్నటి ఎన్నికల్లో రాష్ట్రంలో మూడు కులాల మధ్య అధికారం కోసం రాజకీయాల్లో సాగిన పోరుకు కొనసాగింపుగా ఇప్పుడు విగ్రహాల ఏర్పాటులో సాగుతోంది. కులాలకు, మతాలకు అతీతంగా గొప్పవారిగా గుర్తింపు పొందిన ఈ ముగ్గురు మహనీయులను నాయకులు సామాజిక వర్గం పరిధిలోకి లాగడం ద్వారా వారిని కీర్తిస్తున్నారో, వారి కీర్తిని తక్కువ చేస్తున్నారో వారికి వారే ఆలోచించుకోవాలి. ప్రజారాజ్యం పార్టీ ఎస్వీ రంగారావును ఆశ్రయించింది. దురదృష్టవశాత్తు ఎస్వీరంగారావు మన దేశంలో పుట్టారు, అదే పాశ్చాత్య దేశంలో పుట్టి ఉంటే ప్రపంచంలోని ఐదుగురు గొప్పనటుల్లో ఆయన ఒకరుగా ఉండేవారని ఆయన సమకాలీనడు గుమ్మడి ఒకసారి చెప్పారు. ఎస్వీఆర్ విగ్రహాన్ని ఎప్పుడో ఏర్పాటు చేయకపోవడం పెద్దతప్పు. తెలుగువారు గర్వించదగ ఆ మహానటుని విగ్రహాలను కళాకారులకు ప్రేరణ కలిగించేందుకు ఎప్పుడో ఏర్పాటు చేయాల్సింది. ఎస్వీ రంగారావు 1919లో జన్మించి 1974లో మరణించారు. 36 ఏళ్ల క్రితం మరణించిన ఎస్వీఆర్ విగ్రహాన్ని హఠాత్తుగా ఇప్పుడు ఏర్పాటు చేయడం అంటే రెండు పార్టీలకు మూడో పార్టీ పోటీ కాదంటామా? వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఓదార్పు యాత్ర చేపట్టి గ్రామ గ్రామాన వైఎస్‌ఆర్ విగ్రహాలను ఏర్పాటు చేయడం టిడిపి నాయకులకు కంటగింపుగా మారింది. విగ్రహం ఏర్పాటు చేయడానికి ఒక నాయకుడికి ఉండాల్సిన అర్హతలపై వారు చర్చను లేవదీశారు. బ్రిటీష్ వారిని ఎదిరించిన ప్రకాశం పంతులు విగ్రహం ప్రకాశం జిల్లాలో ఒక్కటి మాత్రమే ఉంది, వైఎస్‌ఆర్ విగ్రహాలు జిల్లాలో లెక్కలేనన్ని ఏర్పాటు చేస్తున్నారు, ప్రకాశం కన్నా వైఎస్ గొప్పవాడా? అని చంద్రబాబు ప్రశ్నించారు. సరే బాబు వాదన బాగానే ఉంది మరి ఎన్టీఆర్ విగ్రహాలు ఇప్పటికే రాష్ట్రంలో లెక్కలేనన్ని ఉన్నాయి, ఇప్పుడు బాబు మళ్లీ ఆవిష్కరణలు మొదలు పెట్టారు. బాబే ప్రశ్నించినట్టు ప్రకాశం పంతులుకు ఒక్క విగ్రహం ఉంటే ఎన్టీఆర్‌కు ఇనె్నందుకు? నిజానికి బాబుకు ఎన్టీఆర్ విగ్రహాలను ఏర్పాటు చేయాలనే పెద్ద కోరికేమీ లేదు. తప్పని పరిస్థితుల్లో పోటీ కోసం ఆయనా పని చేయక తప్పడం లేదు. 96లో ఎన్టీఆర్ మరణిస్తే , పార్టీ నాయకుల సూచన మేరకు ఎన్టీఆర్ భవన్‌లో 2008లో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్ మరణించిన పనె్నండేళ్లకు కానీ పార్టీ కార్యాలయంలోనే ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయలేదు. ఎన్టీఆర్ మరణం తరువాత ఆయన పేరు పూర్తిగా మరిచిపోయి పార్టీ మొత్తం తన ముద్ర కొనసాగాలని బాబు కోరుకున్నారు. చివరకు పార్టీ సభ్యత్వ రసీదుల పై నుండి ఎన్టీఆర్ ఫోటో తొలిగించారు. బాబు ఇప్పుడు ఎన్టీఆర్ విగ్రహాలను ఆవిష్కరిస్తుంటే మరోవైపు హరికృష్ణ ఒకేసారి ఎన్టీఆర్, పరిటాల రవిల విగ్రహాలను ఆవిష్కరించారు.
వైఎస్‌ఆర్ నుండి ప్రజలు ఏం నేర్చుకోవాలని విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నారనేది చంద్రబాబు ప్రశ్న. 74 ఏళ్ల వయసులో సన్యాసాన్ని వదిలిపెట్టి పెళ్లయిన దంపతులను విడదీసి రెండో పెళ్లి చేసుకున్న ఎన్టీఆర్ రాష్ట్రాన్ని బ్రష్టుపట్టిస్తున్నారని చంద్రబాబు, ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు తిరుగుబాటు చేసి ముఖ్యమంత్రి పదవి నుండి తొలిగించారు. మరి అలాంటి వారి నుండి ప్రజలు ఏం నేర్చుకోవాలని విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నారనే ప్రశ్న బాబుకు ఎదురు కాదా?
ఆ మధ్య తెలంగాణ ఉద్యమం సాగేప్పుడు అసెంబ్లీ ముట్టడికి ఆందోళన కారులు పిలుపును ఇచ్చారు. విలేఖరుల మాట అటుంచి ఎమ్మెల్యేలు సైతం అసెంబ్లీకి వెళ్లడం కష్టంగా మారింది. పోలీసులు మొత్తం నగరాన్ని దిగ్బంధించారు. ఇలాంటి పరిస్థితుల్లో పది మంది బృందం అసెంబ్లీ ఆవరణలో లోనికి వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో వీరు లోనికి ఎలా వచ్చారా?అని విలేఖరులు ఆలోచిస్తుంటే వారు వచ్చిన పని మరింత ఆశ్చర్యం కలిగించింది. మాజీ ఎంపి ఉపేంద్ర విగ్రహాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేయాలని చిరంజీవి ద్వారా ముఖ్యమంత్రిని కోరేందుకు వారు వచ్చారని తెలిసి అంతా విస్తుపోయారు. తెలంగాణ ఉద్యమం సాగినప్పుడు తెలంగాణలో కొందరు నాయకుల విగ్రహాలను కూల్చారు. అదే విధంగా సీమాంధ్రలో తెలంగాణ నాయకుల విగ్రహాలు కూల్చాలని కొందరు ఆందోళన కారులు ప్రయత్నిస్తే, ఒక్క విగ్రహం కూడా కనిపించలేదని పిచ్చాపాటిగా మాట్లాడుతూ సీమాంధ్ర ఎమ్మెల్యేలు తెలిపారు. హైదరాబాద్ నగరంలో సీమాంధ్రకు చెందిన ఒక పోలీసు అధికారి విగ్రహాన్ని సైతం ఏర్పాటు చేశారు. కానీ తెలంగాణ పోరాటంలో పాల్గొన్న గొప్ప యోధుల విగ్రహాలు మాత్రం మనకు కనిపించవు. స్వాతంత్య్రం వచ్చిన తరువాత జరిగిన తొలి పార్లమెంటు ఎన్నికల్లో నెహ్రూ కన్నా ఎక్కువ మెజారిటీ వచ్చిన రావి నారాయణరెడ్డి విగ్రహం కనిపించదు. రావినారాయణరెడ్డి సంస్మరణ సభలో నగరంలో ఆయన విగ్రహం లేదనే విషయం తెలిసి వైఎస్‌ఆర్ విస్తుపోయారు. అంతటి మహనీయుని విగ్రహం ఏర్పాటు చేయకపోవడం మనం సిగ్గుతో తలదించుకోవలసిన విషయం అని, విగ్రహాన్ని ఏర్పాటు చేస్తానని 2006లో ప్రకటించారు. ఇప్పటికీ అలాంటి త్యాగజీవి విగ్రహం లేదు. నిజాం కొలువులో ఉద్యోగం చేసిన శ్రీశ్రీ విగ్రహం నగరంలో ఏర్పాటు చేశారు. మంచిదే మహాకవిని మనం స్మరించుకోవలసిందే. కానీ నిజాంను ఎదిరించి పోరాడిన దాశరథి విగ్రహం మాత్రం ఏర్పాటు చేయలేదు. తెలంగాణలోని ప్రతి పల్లెలోనూ ఇప్పుడు వైఎస్‌ఆర్ విగ్రహమో, ఎన్టీఆర్ విగ్రహమో కనిపిస్తుంది.
ప్రజల్లో చైతన్యం తీసుకు వచ్చిన నాయకుల విగ్రహాలను ఏర్పాటు చేసి వారిని స్మరించుకోవలసిందే. అదే సమయంలో సామాజిక వర్గం ఆధిపత్యాన్ని చాటి చెప్పే విధంగా విగ్రహాల ఏర్పాటు ఎంత మాత్రం తగదు. పూజలందుకున్న వారి విగ్రహాలను రష్యాలో కూల్చివేయడం మనం చూడలేదా?(October 3rd, 2010) http://www.andhrabhoomi.net/sub-feature/3sf1-090

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

మీ అభిప్రాయానికి స్వాగతం