5, ఏప్రిల్ 2011, మంగళవారం

ఆపాత మధురం : నాటి సీరియస్ వార్తలు - నేటి హాస్య గుళికలు

కష్టాల నుంచే హాస్యం పుట్టుకొస్తుంది. బహుశా జీవితంలో సుఖాలు పెరిగిపోయినందు వల్లనే నేమో హాస్యానికి పెద్దగా చోటు కనిపించడం లేదు. చార్లీ చాప్లిన్ జీవితమంతా కష్టాల మయమే అందుకే ఆయన హిట్లర్‌పై కూడ హాస్యాన్ని పండించాడు.
అద్రక్‌కే పంజే నాటకం గురించి తెలియని నాటక ప్రియులు ఉండరేమో!ఇంట్లో తినడానికి తిండి లేదు, పిల్లకు పాలు లేవు, వర్షం వస్తే నీరంతా ఇంట్లోకే వస్తుంది.... పాత తెలుగు సినిమాల్లో కూడా చూపనన్ని కష్టాలు అతనివి. అతని జీవితంలోని కష్టాలను చూసి అతనికే నవ్వోచ్చి, అద్రక్‌కే పంజే( అల్లం వేర్లు) నాటకం పుట్టుకొచ్చింది. ఈ ఉర్దూ నాటకాన్ని రాజ్‌కపూర్ వంటి మహానటులు ఎంతో ఇష్టంగా చూశారు. ఒకే నాటకం దశాబ్దాల పాటు ప్రదర్శించడం ప్రపంచ రికార్డు. హాస్యం పంట పండడంతో కోట్ల రూపాయల సంపద కూడా పుట్టుకొచ్చింది.

జీవితంలో సుఖాలు పెరిగిన తరువాత ఇక హాస్యం ఎందుకు మిగులుతుంది? అందుకే నేమో కష్టాలు పోయి ఇన్ని సుఖాలు వచ్చిన తరువాత కూడా ఆ నాటకాన్ని ప్రదర్శించడం తగదనుకున్నట్టున్నారు. బోలెడు డిమాండ్ ఉన్నప్పటికీ నాటక ప్రదర్శనను నిలిపి వేశారు.
మన జీవితాల్లో కూడా సుఖాలు బాగా పెరిగిపోయినట్టుగా ఉంది అందుకే హాస్యం కనిపించకుండా పోయింది. మానవ జీవితం కష్టాల మయం, సినిమాల్లో ఏ ఫార్ములాకైనా కాలం చెల్లిపోతుందేమో కానీ హాస్యం ఫార్ములా ఎప్పుడూ సజీవంగా ఉంటుంది. తెలుగు సినిమాల్లో నాలుగైదు పేర్లు చెప్పమంటే మనకు ఠక్కున గుర్తుకు వచ్చే పేర్లలో మిస్సమ్మ, రాముడు భీముడు, గుండమ్మ కథ తప్పకుండా ఉంటాయ. కథ ఏదైనా, హీరోలు ఎవరైనా ఇవి ముమ్మాటికి హాస్య చిత్రాలే. అందుకే ఇంత కాలం సజీవంగా నిలిచాయి.

దేవుళ్లకు కూడా తమ జీవితం బోర్‌గా అనిపించినట్టుగా ఉంది. అందుకే ఒకరి తరువాత ఒకరు హాస్య రచయితలను పైకి పిలిపించుకుంటున్నారు. రంభ, ఊర్వశి, మేనకల నృత్యాలను ఎంత కాలమని చూస్తారు. అందుకే బోర్‌డమ్ నుంచి బయటపడేందుకు మన హాస్య రచయితలను పిలిపించుకుంటున్నట్టున్నారు.

మృత్యువును దూరం చేసే అమృతం గురించి దేవుళ్లకు తెలుసునేమో కానీ అంత కన్నా ప్రమాదకరమైన బోర్‌డమ్ నుంచి బయటపడేసే హాస్యం కోసం ఎంతటి దేవుళ్లయినా మనుషుల మీద ఆధారపడాల్సిందే! ఎప్పుడొ దశాబ్దాల క్రితం వచ్చిన కన్యాశుల్కం, గణపతి వంటి ఆరేడు గ్రంథాలు తప్ప తెలుగులో అంత గొప్ప హాస్య రచనలేమున్నాయని నసిగే వాళ్లు లేకపోలేదు.

నిజానికి రాజకీయాలను మించిన హాస్యం మరోటి ఉండదేమో! ఆస్వాదించే గుణం ఉండాలి కానీ రాజకీయాల్లో నిత్యం హాస్యాన్ని పండించే మహనీయులు ఎంత మంది లేరు. హాస్యాన్ని పండించడంలో ఏ నాయకుడూ తక్కువ తినలేదు. 1982లో హెలికాఫ్టర్‌ను వాడిన టి అంజయ్యను హాస్యంగా చూపి గేలి చేసిన మీడియా , 13 ఏళ్ల తరువాత, 1995లో చంద్రబాబు హెలికాఫ్టర్‌ను వాడితే హెటెక్ బాబుగా ప్రచారం చేయడాన్ని మించిన హాస్యం ఏముంటుంది. మంచి హాస్యరచనలు ఎక్కడ దొరుకుతాయని తెలిసిన వారిని చాలా మంది అడుగుతుంటారు.

నిజానికి పాత పత్రికలను మించిన హాస్య సంచికలు ఎక్కడా దొరకవు. వార్తా పత్రికలను సాధారణంగా ప్రపంచంలో ఏం జరిగిందో తెలుసుకోవడానికి, జ్ఞానం పెంచుకోవడానికి చదువుతారు. ఏ రోజు పేపర్ ఆరోజు చదివితే అంతా అనుకున్నట్టు బోలెడు జనరల్ నాలెడ్జి వస్తుందనేది నిజమే కానీ పాత పేపర్లు చదివితే అంతకు మించిన హాస్యం ఎక్కడా దొరకదు. అనుమానంగా ఉంటే ఒక్క సారి ఏడాది వెనక్కి వెళ్లి అప్పటి పేపర్లు చదివి చూడండి. వార్తా పత్రికల జీవిత కాలం ఒక రోజు మాత్రమే, ఒక రోజు గడిస్తే వార్తా పత్రిక కిరాణా షాపులో పొట్లంగా మారుతుందంటారు.

ఇది నిజమే కానీ ఓల్డ్ ఇస్ గోల్డ్ అన్నట్టు వార్త పత్రికల నిల్వ ఎన్ని రోజులు ఎక్కువ అయితే అంత హాస్యాన్ని పండిస్తుంది. ఆ పాత మధురం అనే మాట అన్నిటి కన్నా పత్రికలకే ఎక్కువ వర్తిస్తుంది.
ఏడాది వెనక్కి వెళ్లారా? ఏముందక్కడ?

ఒక్కసారి హెడ్డింగులను కాస్త గట్టిగా చదవండి.
టిఆర్‌ఎస్ అధ్యక్షుడి ఇంట్లో చంద్రబాబు, కెసిఆర్, రాఘవులు, నారాయణ భేటీ. మహాకూటమిపై చర్చలు. మనసు విప్పి ఆప్యాయంగా మాట్లాడుకున్న నేతలు. టీ కప్పులో తుఫాను సృష్టిస్తాం. మహాకూటమిలో చేరిన టిడిపి, సిపిఐ, సిపిఎం, టిఆర్‌ఎస్ కలిసి కాంగ్రెస్‌ను మట్టికరిపిస్తామని బివి రాఘవులు ప్రకటించారు.

మహాకూటమి ఘన విజయం ఖాయం. బాబు సభలకు జనమే జనం. ఉండవల్లి అరుణ్‌కుమార్‌కు మూడో స్థానం ఖాయం. నెలకు రెండువేల రూపాయల నగదు బదిలీ పథకం జనంలోకి బాగా వెళ్లింది.

మేం జరిపిన సర్వేలో ఈ పథకం అద్భుతమైందని ప్రజలు పేర్కొన్నారు. తన కుమారుడు లోకేశ్ బుర్రలో పుట్టిన ఈ పథకాన్ని మూడో ప్రత్యామ్నాయం అధికారంలోకి రాగానే దేశ మంతటా అమలు చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. ఈ పథకంతో కాంగ్రెస్ ఓటిమి ఖాయమని తేలిపోయింది.

నిజామాబాద్ జిల్లాలో ఎంపిటీసి ఉప ఎన్నికల్లో టిడిపి, టిఆర్‌ఎస్ కూటమి విజయం సాధించడంతో అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమి విజయం ఖాయమని తేలిపోయింది. ఓటమి ఖాయమని తెలిసి సచివాలయం నుంచి ముఖ్యమైన ఫైళ్లు మాయం చేస్తున్నారని చంద్రబాబు ధ్వజమెత్తారు. సిపిఎం నిర్వహించిన సర్వేలో మహాకూటమికి 158 సీట్లు వస్తాయని వెల్లడైంది. సిపిఎంకు 12 సీట్లు ఖాయం.

మరిన్ని స్థానాల్లో బలమైన పోటీ ఇస్తోంది. నవ్వు ఆపుకోలేక పోతున్నారా? సరే ఈ మహాకూటమి సంగతి వదిలేసి ఇంకొంచం ముందుకు వెళదాం. చిరంజీవి రాజకీయాల్లో వస్తే 90 శాతం మహిళలు, 82 శాతం యువకులు, 77 శాతం మధ్య వయస్కులు చిరంజీవికే ఓటు వేస్తామని మేం నిర్వహించిన సర్వేలో తేలింది. చిరంజీవి అధికారంలోకి రావడం ఖాయం. ఇక చాలంటారా? అందుకే పాత పత్రికలను పారేయకండి ఎంత పాతవయితే అంత హాస్యాన్ని పండిస్తాయి. *

1 వ్యాఖ్య:

మీ అభిప్రాయానికి స్వాగతం