9, ఏప్రిల్ 2011, శనివారం

ప్రజా సేవకు వయసొచ్చింది .......

డాక్టర్ డాక్టర్....!‘అదేం టమ్మా ఎంత హీరోగారి భార్యవైనా ఒకే పదాన్ని రెండేసి సార్లు పలకాలా?’’‘‘ డాక్టర్ డాక్టర్ నాకేదో భయంగా ఉంది డాక్టర్. మీరు వెంటనే మా ఇంటికి వచ్చేయండి. మా ఆయన మొన్నటి నుంచి ఒకే మాటను కలవరిస్తున్నారు. మొదటి సారి విన్నప్పుడు ఏదో యథాలాపంగా అన్నాడేమోననుకున్నాను. ఇప్పుడు అర్ధం పర్ధం లేకుండా పదే పదే అదే మాట అంటూ కలవరిస్తున్నాడు. లేపి ఏంటండి ఆ కలవరింతలు అనడిగితే ముసిముసి నవ్వులు నవ్వుతున్నాడు తప్ప ఏమీ మాట్లాడడం లేదు. అసలే సినిమాలు లేవు. కుర్ర హీరోలు సినిమా రంగాన్ని దునే్నస్తున్నారు. ఈయన సినిమాలు వరస పెట్టి ఫ్లాపయ్యాయి. దాంతో ఆయన అర్ధం పర్ధం లేకుండా మాట్లాడుతున్నారేమోననిపిస్తోంది.’’ అని హీరో శ్రీమతి కంగారుగా చెప్పింది.‘‘ ఇంతకూ మీ హీరోగారు ఏం కలవరిస్తున్నాడు’’ అని డాక్టర్ అడిగాడు.‘‘ ఇంత కాలం నన్ను ఆదరించిన ఈ ప్రజల కోసం ఏదో చేయాలి’’ అంటూ పదే పదే కలవరిస్తున్నాడు డాక్టర్. ఇంత కాలం సినిమాల్లో సంపాదించించిందంతా ప్రజలకిచ్చేస్తాడేమోనని భయంగా ఉంది. ఆయనతో ఎవరూ సినిమా తీసేట్టుగా లేరు కాబట్టి సొంత డబ్బు పెట్టి సినిమాలు తీస్తారేమోనని భయంగా ఉంది. నిర్మాతల సొమ్ముతో తీసిన సినిమా అయితే పరవాలేదు కానీ సొంత డబ్బుతో సినిమా తీస్తే ఆయన్ని నమ్ముకున్న నేను నా పిల్లలు ఏం కావాలి డాక్టర్ ’’ అంటూ శ్రీమతి హీరో గద్గద స్వరంతో పలికింది.‘‘ మీరు అనవసరంగా కంగారు పడుతున్నారు. అసలేమైందో ముందు నన్ను ఆలోచించనివ్వండి. మీ అమ్మాయి పెళ్లయింది కదా? ’’ అని డాక్టర్ అడిగాడు.‘‘ అమ్మాయి పెళ్లయింది. అబ్బాయిని హీరోగా పరిచయం చేశారు. మనవడు చిన్నోడు వాడు త్వరత్వరగా పెద్దగయితే హీరోను చేసేద్దామని రోజూ హార్లిక్స్ తినిపిస్తున్నాం’’ అంటూ శ్రీమతి హీరో చెప్పుకు పోసాగింది.‘‘ఓస్ అదా! అయితే మీరు సంతోషించాలి కానీ, ఇలా కంగారు పడతారేమిటండి’’అని డాక్టర్ నవ్వాడు.నేను ఎక్కవగా అందరి దృష్టిలో పడితే మా ఆయన వయసు తెలిసిపోతుందని నన్ను ఎక్కువగా బయటకు రానివ్వరు దాంతో నాకు లోకజ్ఞానం తక్కువ. ఇప్పుడు మీరు నన్ను మరింత కంగారు పెట్టకండి డాక్టర్ అని శ్రీమతి హీరో పలికింది.‘‘్భయపెట్టడం కాదండి శ్రీమతి హీరోగారు. మీ ఆయనకొచ్చిన జబ్బు ఈ వయసులో అందరికీ వస్తుంది. సినిమాల్లో వయసు మీరిన వారికి ఇది అనివార్యం. మీ ఆయన వయసు పిలుస్తోంది. ఈ కోరిక గతంలో అయితే 60 ఏళ్లకు కనిపించేది. ఇప్పుడు కాలం మారింది 50 నుంచి 55 ఏళ్ల వయసులోనే ఈ జబ్బు వచ్చేస్తుంది. అదే హీరోయిన్లకైతే 40 నుంచి 45 ఏళ్ల వయసులో వారి వారి అవసరాలు, ఆసక్తి బట్టి వచ్చేస్తుంది. ఐనా ఈ జబ్బు వచ్చినందుకు సంతోషపడాలి కానీ బాధపడతారేమిటి? ’’ అని డాక్టర్ ప్రశ్నించాడు. శ్రీమతి హీరోకు ఆయోమయంగా ఉంది. జబ్బోస్తే సంతోషించడం ఏమిటండి అనడిగింది.‘‘ మీ ఆయన షష్టిపూర్తికి చేరువగా ఉన్నారు కదా! ఇంకెంతో కాలం హీరోగా నిలబడలేరు. ఇప్పటి వరకు ఉన్న గ్లామర్‌ను క్యాష్ చేసుకోవడానికి రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారన్నమాట! మీ ఆయన పార్టీ పెట్టాక మరిచిపోకండి మేడం నాకూ 60 ఏళ్లు వచ్చేశాయి, ప్రజలకు ఏదో చేయాలని నాకూ ఉంది ఏదో ఒక నియోజక వర్గం టికెట్ ఇప్పించేస్తే ప్రజలకు నేను సైతం ఏదో ఒకటి చేస్తా’’ అని డాక్టర్ వినయంగా అడిగాడు. ‘‘ మీరు చెబుతున్నది నిజమేనా ?’’ అని హీరో శ్రీమతి అడిగింది.నిజమండి కావాలంటే ఇలాంటి కేసులు బోలెడున్నాయి. ఎన్టీఆర్‌కు సరిగ్గా 60 ఏళ్ల వయసులోనే హీరో వేషాలను త్యాగం చేసి ఇంత కాలం తనను ఆదరించిన ప్రజలకు ఏదో సేవ చేయాలనిపించింది. అప్పుడంటే 60 ఏళ్ల వరకు హీరోలుగా నటించే అవకాశం ఉండేది కాబట్టి ఆయనకా వయసులోనే ప్రజలకేదో చేయాలనిపించింది. తరువాత హీరోల వయసు మరో ఐదు పదేళ్లు తగ్గింది. తన కొడుకు హీరోగా నిలదొక్కుకున్నాక 50 ఏళ్లు దాటిన తరువాతనే హఠాత్తుగా చిరంజీవి ఇంత కాలం తనను ఆదరించిన ప్రజలకు ఏదోచేయాలనిపించి రాజకీయాల్లోకి వచ్చారు. బాలకృష్ణ 49 ఏళ్ల వయసులో ఉండగానే మొన్న ఎన్నికల్లో పోటీ చేయాలని ప్రయత్నించారు. అప్పుడే కాదు, సినిమా సంప్రదాయాన్ని పాటించి, కనీసం 55 ఏళ్ల వయసు వచ్చిన తరువాత మాత్రమే ఈ ప్రజలకు ఏదైనా చేయాలనిపించాలని చాలా మంది ఆయనకు నచ్చజెప్పారు. ఆయనకు 50 నిండాయి. కొడుకును హీరో చేసే ప్రయత్నాలు చేస్తున్నాడు. వచ్చే ఎన్నికల నాటికి ఆయనకు ఇంత కాలం తనను ఆదరించిన ఈ ప్రజలకు ఏదో చేయాలనిపించడం ఖాయం. అయితే వయస్సొక్కటే కాదు కాలం కూడా కలిసి రావాలి. హీరోలే కాదు హీరోయిన్లు సైతం ! జయప్రద అంతే కదా40 దాటాక హీరోయిన్ అవకాశాలు పోయే సరికి ఇంత కాలం తనను ఆదరించిన ప్రజలకు ఏదో సేవ చేయాలనిపించి రాజకీయాల్లోకి వచ్చేశారు. రోజా, కవిత, శారద అందరికీ 40 దాటి అవకాశాలు సన్నగిల్లాకే ప్రజలకు ఏదో చేయాలనే భావన కలిగింది. కొందరు వయసు రాకముందే రాజకీయాల్లోకి వచ్చినా వారు గెస్ట్ ఆర్టిస్టులుగానే ఉండిపోతారు కానీ శాశ్వతంగా రాజకీయాల్లో ఉండలేరు. మోహన్‌బాబు, జూనియర్ ఎన్టీఆర్ అలాంటి వారన్నమాట. పరిస్థితిని చూస్తుంటే మరో పదేళ్లలో జూనియర్‌కు తనను ఆదరించిన ప్రజలకు ఏదోసేవ చేయాలనే భావన వచ్చే అవకాశాలు బలంగానే కనిపిస్తున్నాయి’’ అంటూ డాక్టర్ చెప్పాడు.‘‘మీరు చెప్పింది విన్నాక నాకూ ప్రజలకు ఏదో చేయాలనిపిస్తోంది డాక్టర్’’ అని శ్రీమతి హీరో పలికింది. డాక్టర్ తనకు త్వరలోనే ప్రజలకు ఏదో సేవ చేసే చాన్స్ రాబోతుందని కలల్లో తేలిపోయాడు.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

మీ అభిప్రాయానికి స్వాగతం